‘‘హాయ్, మీ పేరు రమ్య. అవునా?’’కొత్త గొంతు వినిపించేసరికి తలెత్తి చూసింది రమ్య. ఎదురుగా వొకావిడ నవ్వుతూ నిలబడి వుంది. దాదాపు తన వయసే వుంటుందేమో. మిడ్ థర్టీస్.‘‘అవును. మీరు?’’‘‘అయామ్ విజయ. అప్పర్ డివిజన్ క్లర్క్.’’యూడీసీ అని సింపుల్‌గా చెప్పుండొచ్చు.
అంత పొడవాటి డిజిగ్నేషన్‌ని కావాలనే హాస్యానికి సాగదీసి చెపుతోందని అర్థమయ్యి నవ్వేసింది రమ్య.‘‘ట్రాన్స్ఫర్ ఆర్డర్ రెడీ. కానీ, నేను చేరబోయే కొత్త ప్లేసులో నాకంటే ఎక్కువ గ్లామరస్‌గా వున్నవాళ్లెవరైనా వుంటారేమో అనే భయంతో చెక్ చేద్దామని వొక రోజు ముందే వచ్చా.’’‘‘మీరేం వర్రీ అవ్వక్కర్లేదు. ఇక్కడ ఫీమేల్ స్పీషీస్ అని చెప్పదగినదాన్ని నేనొక్కదాన్నే. అండ్ అయామ్ నో మ్యాచ్ టు యువర్ ఎలిగెన్స్’’ చెప్పింది రమ్య. నిజానికి విజయ కన్నా తానే అందంగా వున్నానని రమ్యకి తెలుసు. అందుకే బ్యూటీ అనో, గ్లామర్ అనో కాకుండా ఎలిగెన్స్ అనే పదం వాడింది. థేంక్స్ టు ఇంగ్లిష్.‘‘సో, నేను వేరే ప్లేస్‌కి ట్రై చేస్కోకుండా హ్యాపీగా యిక్కడ చేరిపోవచ్చంటారు’’ అంది విజయ.‘‘నిక్షేపంగా’’ నవ్వుతూ బదులిచ్చింది రమ్య.‘‘పాత ఆఫీసులో నిన్న రిలీవ్ అయ్యాను.
ఈరోజే యిక్కడ జాయిన్ అయిపోవచ్చు. కానీ, వొకరోజు ట్రావెలింగ్ డే వాడుకునే అవకాశం వుంటే ఎందుకు వదులుకోవాలి? పైగా రేపు శ్రావణ శుక్రవారం కదా. మంచిదనీ..’’‘‘గుడ్ ఐడియా. అయినా యిక్కడ పెద్దగా వర్క్ కూడా లేదు. బడ్జెట్ లేని డిపార్ట్‌మెంట్. పని లేని స్టాఫ్. ఎప్పుడొచ్చినా అడిగేవాళ్లు లేరు.’’‘‘వినడానికే ఎంతో హాయిగా వుంది. అవునూ, రేపు స్పెషలేంటి? పట్టు చీరలు, నగలతో అమ్మవారిలా అలంకరించుకు రావాలా? మీ ప్లాన్స్ ఏంటి?’’‘‘మరీ హెవీగా కాదులే గానీ, కొంచెం డిఫరెంట్ లుక్ ట్రై చేయాలిగా.’’‘‘ఏమో. నాకేౖతే సింపుల్‌గా వుండడమే యిష్టం. వేరేవాళ్ల ఎక్స్‌పెక్టేషన్‌కి తగ్గట్టు మనం ఎందుకుండాలి? అయినా ఫస్ట్ డే నే అలా గ్రాండ్ ఎంట్రీ యివ్వడం నాకు నచ్చదు. నేనైతే హాయిగా ఏదో వొక పాత కాటన్ డ్రస్ వేస్కోని వచ్చేస్తా’’ అంది విజయ.