మాధవరావు స్నేహితుడికి ఫోన్‌ చేశాడు, ‘‘భూషణ్‌, మర్చిపోలేదు కదా. రేపు ఉదయం..’’‘‘లేదు లేరా. తప్పకుండా వస్తాను. నైన్‌ థర్టీ, థర్టీ ఫైవ్‌ కల్లా వస్తాను. అయినా ఇంకోసారి ఆలోచించరా, మనకు వాళ్ళ సహాయం అవసరమా? నువ్వు ఇండిపెండెంట్‌గా వేసినా గెలుస్తావు’’ గట్టి నమ్మకంతో అన్నాడు భూషణ్‌.‘‘చూద్దాం. ఒకసారి వాళ్ళతో మాట్లాడితే అసలు వాళ్లకేం కావాలో, మనకు వాళ్ళు ఎంత సపోర్ట్‌ చెయ్యగలరో తెలుస్తుంది.’’‘‘సరే, నీ ఇష్టం. రేపు ఉదయం వస్తాను మరి’’ అంటూ ఫోన్‌ పెట్టేశాడు భూషణ్‌.

*********************

నిలువుటద్దం ముందు నుంచుని కుడివైపూ ఎడంవైపూ తిరిగి అద్దంలో చూసుకున్నాడు రావు. తెల్లటి షర్టూ, బ్లూ ప్యాంటూ. సింపుల్‌గా చక్కగా ఉన్నాయి. హాంగర్‌ మీదున్న నెక్‌ టైల వైపు చూశాడు. స్ట్రైప్స్‌ ఉన్న రెడ్‌ టై బాగుంది. కాలర్‌ ఎత్తి టైని మెడచుట్టూ వేసుకున్నాడు.‘‘అరేయ్‌, చినుకులు పడేట్లుందిరా. తొందరగా బయల్దేరుదాం’’ డైనింగ్‌ ఏరియా నుంచి భూషణ్‌ కేకేశాడు.టై నాట్‌ సర్దుకుంటూ బాత్‌రూమ్‌ నుంచి డైనింగ్‌ ఏరియాకొచ్చాడు మాధవరావు. ‘‘వావ్‌, పెళ్ళిచూపుల కెళ్తున్నట్లున్నావురా! టౌన్‌ కౌన్సిల్‌ సీట్‌కి ఇంత సీన్‌ అవసరమా?’’ అన్నాడు భూషణ్‌ చిరునవ్వుతో.చిన్న నవ్వు నవ్వి, ‘‘పదా’’ అన్నాడు.పది నిమిషాల్లో అమెరికా ఫస్ట్‌ పార్టీ స్థానిక కార్యాలయానికి చేరారు. అప్పటికి కొంచెం సన్నగా వాన పడుతోంది. కారు పార్క్‌ చేసి, గొడుగులు వేసుకుని ఇద్దరూ బిల్డింగ్‌లోకి వెళ్లారు. రిసెప్షనిస్ట్‌తో పార్టీ సెక్రెటరీ మార్క్‌ సెవర్సన్‌ని కలవడానికి వచ్చామని చెప్పారు. అతను లోపలికెళ్ళి మరోవ్యక్తితో బయట కొచ్చాడు. ఆ వచ్చినతను మాధవరావుని గుర్తుపట్టాడు. ‘‘వీడు నా స్నేహితుడూ, కేంపెయిన్‌ మేనేజర్‌ కూడా’’ అని భూషణ్‌ని పరిచయం చేశాడు. గొడుగులు బయట గోడకానించి సెక్రెటరీ ఆఫీసులోకి వెళ్లారు ముగ్గురూ.అదొక చిన్న గది. ఒక వైపు గోడమీద పెద్ద స్టేట్‌ మ్యాప్‌ ఉంది. సెవర్సన్‌ కుర్చీకి కుడివైపు స్టాండ్‌ మీద ఒక పెద్ద అమెరికా జెండా ఉంది. రూమ్‌ నిండా గోడల పక్కన జిరాక్స్‌ చేసిన కాగితాలు పేర్చి ఉన్నాయి. సెవర్సన్‌ డెస్క్‌ మీద ఒక ఫొటోలో అతనూ, మరో వ్యక్తీ షేక్‌ హ్యాండ్‌ ఇస్తూ కెమెరా వైపు చూస్తున్నారు.