ఇనుపముక్క పదునైన పనిముట్టుగా మారాలంటే?కొలిమిలో కాలాల... కొలిమితిత్తులు గాలిని ఊదాల.. బొగ్గు రగిలి రవ్వరవ్వగా మండాల, ఇనుము నిప్పు కణికగా రూపాంతరం చెందాల. అప్పుడు పడే వరుస సమ్మెట దెబ్బలు తట్టుకోవాల.
‘‘నీ చేతులు పడిపోను, ఎంత దెబ్బ కొట్టినాడు పాడు నాబట్ట’’ కూలి పడిపోయిన కృష్ణుడిని ఒడిలో పెట్టుకుని కన్నీరై పోయింది గంగులమ్మ, ధడేల్మని తలుపు వేసుకుపోతున్న నాగులయ్యని చూసి.తండ్రి కొట్టిన దెబ్బ కంటే ‘చదువుకోవద్ద’ న్నాడన్న దుఃఖమే ఎక్కువైంది కృష్ణుడికి.‘‘పసిబిడ్డను చాప సిరిగేట్టు కొడతావా.. నీనోట్లో దుమ్ము తగల’’ ఆ తల్లి ఉక్రోషం తిట్ల వర్షం అయ్యింది. ఒళ్ళో వెక్కుతున్న బిడ్డని చూస్తుంటే ఆమె కడుపు తరుక్కుపోతోంది. చెంగుతో చెమట తుడిచి, కొంగుతో విసురుతూ ‘‘నాయనా కిట్నా ఏందిరా ఇంత పంతం, చదివేదేదో చదువుకోక, వాడి పాల ఎందుకు పడినావురా నాయనా, ఎంత దెబ్బ కొట్టినాడో చూడు, చేతకాని దద్దమ్మ‘‘ అంటూ కుమిలిపోయింది.అమ్మ అనునయంతో కృష్ణుడు కన్నీటి వరద అయినాడు.
‘‘కాదుమా... గురుమూర్తీ,రంగారెడ్డీ, ప్రదీప్ గాడు అందురూ పోతాండారు, నేనూ పోతా పంపీమని చెప్పుమా, కోచింగ్కు’’ అన్నాడు వెక్కుతూనే.‘‘బిడ్డేమన్నా మిద్దెలు మాడీలు అడిగినాడా సదువుకుంటాననే కదా అడిగింది. ఒక చొక్కా సంకురాత్తిరికి కొంటే సమత్సరమంతా ఒంటిమీద ఇంకో కొత్త బట్ట పడేదే లేదు. ఇంగ సదువుకు కూడా దుడ్డు ఈయకపోతే బిడ్డల్ని కనడం ఎందుకూ, పాడు నాశనం..’’ కొడుకుతో జతకలిసింది ఆమె ఏడుపు. కొలిమి నిప్పుల్లా ఎర్రగా మండుతున్నాయి ఆ తల్లి కళ్ళు.గదిలో ఈ మూల నుంచి ఆ మూలకు వేలాడదీసిన సన్నటి రాగి తీగల ఏరియల్ వల నుంచి సిగ్నల్ అందక రేడియోలో కడప కేంద్రం... ‘గర్ర్ ర్ర్ ర్ర్..’ మంటోంది సాయం అందని గుండెలా.తలుపు వెనక, కష్టాల సంకెల పడిన సంసార ఖైదీలా కదలకుండా ఉన్నాడు నాగులయ్య.పెళ్ళాం బిడ్డల ఎక్కిళ్ళు గుండెలో ఫిరంగీ గుళ్ళలా పేలుతున్నాయి. ఎవరిని అడిగినా డబ్బు లేదంటున్నారు. కరువు రోజులు, పల్లెలో చాలామంది దేదారాకుతో కడుపు నింపుకుంటున్నారు. టౌనులో చేబదులు ఇచ్చేంత స్నేహితులు లేరు. దారి తోచనితనం కోపమై బిడ్డ మీద దెబ్బగా పడింది.