‘‘అటు చేసి ఇటు చేసి మొత్తానికి సెటిల్ అయ్యాడు కదక్కా మన వెంకట్ గాడు’’ అంది రత్న కాఫీ గ్లాస్ అందుకుని సోఫాలో కూచుంటూ.రత్న చామనఛాయ - తండ్రి పోలిక. కాఫీ అందించిన అలివేలు తెలుపు - తల్లి పోలిక. అలివేలుకు తండ్రి అంటే చాలా ఇష్టమున్నా రత్న కంటే వెంకట్ మీదనే ఇష్టం.
వెంకట్ కూడా తండ్రిలానే ఉంటాడు. చామన ఛాయ.అలివేలుకు ఆ రోజు సంతోషంగా ఉంది. పొద్దున బస్సుకి ఊరు నుండి చెల్లెలు దిగింది. ఆ వేళ తమ్ముడి ఇంటి గృహప్రవేశం ఉంది. సంతోషమే కదా. తనూ కాఫీ గ్లాస్ తీసుకుని సింగిల్ సీటర్‌లో కూచుంటూ చెల్లెలుతో అంది-‘‘మనిద్దరం డిగ్రీ అయినా పూర్తి చేశాం. చేతిలో చదువుంది అనిపించుకున్నాం. వాడికి అదీ లేదు. నాన్న చాలా టెన్షన్ పడ్డాడు వీడి గురించి. ఇప్పుడు చూడు చక్కగా సెటిల్ అయ్యాడు. ఇంకేం కావాలి? నాన్న ఆనందం పట్టలేక పొంగిపోతాడు.’’రత్న కాఫీ గుక్క వేసింది.‘‘అంతా శ్రీదేవి అదృష్టం అక్కా. పైసా కట్నం తీసుకురాలేదు. పెళ్లప్పుడు ఆడపడుచుల లాంఛనాలు కూడా ఇవ్వలేదుగా మనకి.
మనం పెళ్లి చూపులకు వెళ్ళినప్పుడు ఎలా ఉందక్క వాళ్ళ బతుకు? బస్సు వెళ్ళడానికి రోడ్లు కూడా లేని ఊరు. చుట్టూ ఒకటే ఎర్ర మట్టి, బురద. మన అంబాసిడర్‌ని ఆ సందుల్లో తిప్పడానికి ఎంత ఇబ్బంది పడ్డాడు డ్రైవరు? మాంచి ఎండల్లో వెళ్ళాము పిల్లని చూడటానికి. వచ్చినాళ్ళకి కనీసం మజ్జిగ చుక్క కూడా పోయలేని పరిస్థితి వాళ్ళది.’’‘‘వాళ్ళమ్మయితే ఏదో జబ్బుతో మంచం మీద పడుంది. ఇక తండ్రి? మురికి చొక్కా వేసుకుని కట్నం మాట ఎత్తితే కంగారు కంగారు పడ్డాడు కదా..’’‘‘అందుకేగా పెళ్లి ఖర్చంతా నాన్న పెట్టాడు. మన వెంకట్‌గాడు చక్కగా చదువుకునుంటే డబ్బున్న పిల్లొచ్చేది. ఇంకా ఆలస్యం చేస్తే ఈ సంబంధం కూడా పోతుందని మనకి తప్పలేదు. మన ఇంటికి రావడం శ్రీదేవి చేసుకున్న అదృష్టం అక్కా.’’