అట్ట మీద బొమ్మ, పుస్తకం పేరు చూసి మహానటి సావిత్రికే పరిమితమైంది అనుకుంటే పప్పులో కాలేసినట్లే! రచయిత ఆమెకు సముచితంగానే పేజీలు కేటాయించారు. అలాగే ఆమెతోపాటు అభినయంతో అబ్బురపరిచినప్పటికీ  జీవితంలో సర్వం కోల్పోయిన మరికొంత మంది నటులను కూడా ఇందులో గుదిగుచ్చడం విశేషం. ఒక్క విషయం,  మహానటి సినిమా తరవాత సావిత్రి గురించి మరింత తెలుసుకోవాలన్న ఉత్సుకత ఆమె అభిమానుల్లో సహజంగానే నెలకొంది. అందుకు అద్దంపట్టే విషయాలను అందంగా ఇందులో పేర్చిపెట్టారు. సావిత్రికి బాగా లేని రోజుల్లో ఎస్వీ రంగారావు ఒకసారి భోజనం పెట్టించినట్లు  ‘మహానటి’ సినిమాలో చూశాం. అయితే అలా భోజనం పెట్టించింది గుమ్మడి వెంకటేశ్వర రావు అని తెలిపారు. సినీవినీలాకాశంలో తనదైన ముద్ర వేసిన భానుమతి విశేషాలు అలరిస్తాయి. భానుమతి, సావిత్రి ఇంటర్వ్యూల కోసం రచయిత పడిన తపన నిజంగా తెలుసుకోదగ్గది. 

లబ్దప్రతిష్టులైన నటుల  ఇంటర్వ్యూల కోసం సినీ పాత్రికేయులు పడే పాట్లు ఇది చదివితే అర్థమవుతాయి. మీనాకుమారి, రంగనాథ్‌, హరనాథ్‌, రాజనాల, దివ్యభారతి తదితరుల తెరవెనుక కథలను హృద్యంగా ఆవిష్కరించారు. తనే కాకుండా ఇతర జర్నలిస్టులు చేసిన ఇంటర్వ్యూలకు కూడా పుస్తకంలో చోటిచ్చి మరింతగా వన్నెలద్దారు. అయిదు వేర్వేరు ప్రచురణలతో ఆ రోజుల్లో విరాజిల్లుతున్న ఆంధ్రజ్యోతిలోకి  తను చేరడాన్ని రచయిత  గొప్పగా చెప్పుకొవడం చాలా బాగుంది.  ఎవరో చెప్పినవి కాకుండా తనకు బాగా తెలిసిన విషయాలనే స్పష్టంగా తెలియజేశారు.

 

అద్భుతనటి సావిత్రి
రచయిత: పసుపులేటి రామారావు
పేజీలు:  298,  వెల:  రూ.300
ప్రతులకు: నవోదయ బుక్‌హౌస్‌
రచయిత ఫోన్‌ నెం: 9392364031