‘గుచ్చి గుచ్చి చూస్తున్నాడు. నన్నేనా!? నన్నెందుకు చూస్తాడు? నన్ను కాదులే. అవును నన్నే. అలా చూస్తున్నాడేమిటి? అదిగో మొబైల్ తీస్తున్నాడు. ఎవరికైనా చెప్తాడా? ఏం చెప్తాడు? ఎవరినైనా పిలుస్తాడా? ఎందుకు పిలుస్తాడు? పారిపోనా? ఎందుకు? ఎక్కడకి? అదిగో, చూపు మరల్చినట్టుగా మరల్చి మళ్లీ చూస్తున్నాడు.
ఆ చూపులో ఏదో ఉంది! ఆ, ద్వేషం! ద్వేషమే అది. మనల్నందర్నీ కాపాడ్డానికి వాళ్ల దేవుడు గొంతులో బిగబట్టుకున్నాడే, అది వాడి కళ్లలో, చూపుల్లో ప్రవహిస్తోంది.. విషం! విషంగా చూస్తున్నాడు. చూడ్డం అంటే, కళ్లలోకి కదా చూడాలి. వాడు నా కళ్లలోకి చూడట్లేదు. నాలుగంగుళాలు కిందికి చూస్తున్నాడు!!’‘మిర్రి మిర్రి చూస్తున్నాడు. నన్నేనా!? నన్నెందుకు చూస్తాడు? నన్ను కాదులే. అహ నన్నే. అలా చూస్తున్నాడేమిటి? అదిగో జేబులో చెయ్యి పెట్టాడు! ఏం తీస్తాడు? రివాల్వరా? బాంబా? పేలుస్తాడా? ఎందుకు పేలుస్తాడు? దాక్కోనా? ఎలా? ఎక్కడ? అదిగో నన్ను తప్పించుకోడానికన్నట్టు నాలుగడుగులు దూరంగా నడిచి, మళ్లీ నన్నే చూస్తున్నాడు. ఆ చూపులో ఏదో ఉంది! ఆ, ద్వేషం! ద్వేషమే అది. వాళ్ల ప్రవక్తను చంపేయడానికి ఓ మహా తల్లి గొర్రెపిల్లలో నింపి ఇచ్చిందే, అది వాడి కళ్లలో, చూపుల్లో ప్రవహిస్తోంది.. విషం! విషంగా అగుపిస్తున్నాడు. చూడ్డం అంటే కళ్లలోకి కదా చూడాలి.
వాడు నా కళ్లలోకి చూడట్లేదు. ఒక్కంగుళం ఎగువన చూస్తున్నాడు!!’కారు తుడుచుకోడానికి చిన్న బకెట్లో నీళ్లు తీసుకుని, గుడ్డతో బయటకు వచ్చాను. వైపర్స్ పైకి లేపి అద్దం, ముందువైపు తుడిచేసి విండో అద్దాలు తుడుచుకుంటూ వెనక్కు వచ్చాను. ప్రాణం ఉసూరుమంది. సాలెగూడులాంటి చిక్కటి గీతలు. వెనక అద్దం బద్దలు బద్దలుగా చిట్లిపోయి ఉంది. రెండు నెలల్లో ఇది మూడో సారి. ఏదో తగిలితే పగిలినట్లుగా లేదది. పనిగట్టుకుని పగలగొట్టినట్టుగా ఉంది. కిందకు చూస్తే.. సగం ఇటుక. దానికి అంటుకున్న గాజు ముక్కలు. పగిలిన అద్దం మీద ఇటుక పొడి మరకలు. కోపం నషాళానికి అంటింది. నాకు కోపమా.. నా శ్రాద్ధం! ఏడుపొచ్చింది. పోలీసు కంప్లయింటు ఇచ్చేయనా? కారు అద్దం పగిలిందని కాగితం రాసుకెళ్తే నవ్వుతారేమో. ఛీకొట్టొచ్చు. గెటవుట్ అని అరవొచ్చు. లేదా, మేం చందాలేసుకుని కొత్త అద్దం వేయిస్తాం.. ఈ బోడి కంప్లయింటు రిజిస్టరు, ఎంక్వయిరీ చేయడం కంటే మాకు అదే ఈజీ అని వెటకారం చేయొచ్చు. కారు తుడిచే ముచ్చటకు స్వస్తి పలికి ఇంట్లోకి నడిచాను.