అరచేతిలో విశ్వ కవిత్వం
1980ల తర్వాత ఇతర దేశాల ఇరుగు పొరుగు రాష్ట్రాల సాహిత్యాన్ని పరిచయం చేసే పుస్తకాలు తెలుగులో రాయడం లేదా ప్రచురించడం ఎందుకో ఆగిపోయింది. దాదాపు రెండు దశాబ్దాల సుదీర్ఘ విరామం తర్వాత 130 దేశాలకు చెందిన రెండు వేల మంది కవులనూ, వారి కవిత్వాన్నీ వారి వారి దేశాల నేపథ్యంలో, అత్యంత సంక్షిప్తంగా వివరించిన పుస్తకం ముకుంద రామారావు రాసిన ‘అదే గాలి- ప్రపంచ కవిత్వం, నేపథ్యం’.
బహుశా మొత్తం ప్రపంచ దేశాల కవిత్వాన్ని పరిచయం చేసిన పుస్తకం తెలుగులో ఇదే మొట్టమొదటిది కావొచ్చు. ఇటువంటివి రాయడం చాలా శ్రమతో కూడుకొన్న వ్యవహారం. రచయితకు విపరీతమైన ఓపికా, సహనం లేకుంటే ఇలాంటివి సాధ్యపడవు. ఆయా దేశాల కవుల కవిత్వం, ఆ కవిత్వ నేపథ్యం, వారి జీవితాలనే కాదు వారి వారి దేశాల సామాజిక రాజకీయ ఆర్థిక చారిత్రక పరిణామక్రమాన్ని కూడా పరిచయం చేశారు ముకుంద రామారావు. కవిత్వాన్ని, చరిత్రను క్రోడీకరించడమే కాదు, దాదాపు 500 కవితల అనువాదాలను అందించడం ద్వారా అంతర్జాతీయ కవిత్వతత్వాన్నీ, స్వభావాన్నీ సులభంగా అర్థం చేయించారు ఆయన.
ఈ పుస్తకంలో సమకాలీన కవులకు చోటులేకపోవడం విచారమనిపించినా రచయిత కష్టం ముందు వీటిని పట్టించుకోకూడదు. ఎవరికి వారే తామే అత్యుత్తమ కవులమనీ, తాము రాసేదే కవిత్వమనీ స్కిజోఫెనిక్‌ భ్రమల్లో మునిగిపోయిన తెలుగు కవులకు ఇలాంటి పుస్తకాలు జ్ఞానోదయం కలిగించే అవకాశాలున్నాయి.
- లెనిన్‌ ధనిశెట్టి
‘అదే గాలి - ప్రపంచ కవిత్వం, నేపథ్యం’,ముకుంద రామారావు
పేజీలు : 560, వెల : రూ.300, ప్రతులకు : ఎమెస్కో బుక్స్‌, 040-23264028