కవిత్వపురానికో రోడ్‌!

ఇప్పుడు ఏ వ్యక్తికావ్యక్తి సమూహంలా జీవిస్తున్నాడు. తనను తానే పారేసుకుంటూ, పోగుచేసుకోలేక వ్యవస్థీకృతంగా, వ్యక్తిగతంగా ప్రయివేటీకరించబడుతున్నాడు. ఈ వర్తమాన చట్రాన్ని... అనుభవాల తాత్విక సంఘర్షణల మధ్య అధివాస్తవి కతతో, సొంత డిక్షన్‌తో దేశరాజు ‘దుర్గాపురం రోడ్‌’లో కవిత్వమై పలవరించాడు. శ్రీకాకుళ పోరాటం ఆనవాళ్ల నుంచి గ్లోబలైజేషన్‌ వరకూ కఠినంగా, మంద్రంగా, మార్మికతతో ప్రయాణించాడు. అనేకానేక చిక్కుముళ్ల మధ్య ఆశ, నిరాశల అనుభూతులతో చరిత్రకు తానే కవిత్వ దిక్సూచిగా మారాడు. ‘‘చెట్లు స్తంభించిపోతాయి / ఆకులు రాలిపడతాయి / వాటికి జీవం లేదని చెప్పగలమా?’’ అని ఆశావాదాన్ని ప్రకటిస్తూనే, ‘‘అవని రహస్యాన్వేషణలో అభయారణ్యమైనవాళ్లు /ఇప్పుడు ఆస్థానాల ఆశ్రయంలో సేదతీరుతున్నారా?’’ అని ప్రశ్నిస్తాడు. ‘‘సంపదను సృష్టించే కలలు కనమని నువ్వన్నావ్‌ / సంపద సృష్టికర్తలకే దక్కాలని వారు కలకన్నారు’’ అని ప్రభుత్వ రీతికి, ప్రజల భవిష్యత్తుకు మధ్య ఉన్న విభజనరేఖ గురించి తేల్చేస్తాడు. పరిశీలన, ఉనికి, ఉద్వేగం, స్పందన, సంయమనం, గాఢత, గాంభీర్యతలతోపాటు కవిత్వ రహస్యాల శైలీ సంలీనత దేశరాజు కవిత్వంలో ‘బెల్స్‌’లా మోగు తుంటాయి. భయంతో విలవిలలాడని అక్షరాలను, విదూషక వేషం వేయని వాక్యాలను, అభౌతికంగా హత్తుకోవాలంటే ఈ‘దుర్గాపురం రోడ్‌’’లోకి ప్రవేశించాల్సిందే. 

- ఎ. రవీంద్రబాబు

 

దుర్గాపురం రోడ్‌ (కవిత్వం) 
రచన: దేశరాజు 

పేజీలు: 176, వెల: రూ. 135

ప్రతులకు: ప్రముఖ పుస్తక కేంద్రాలు