‘అమృతం కురిసిన రాత్రి’ రాసిన దేవరకొండ బాలగంగాధర తిలక్‌ సోదరుడు, సహజంగానే ఆ వారసత్వం అబ్బిన రచయిత కీ.శే. దేవరకొండ గంగాధర రామారావు. వృత్తిరీత్యా న్యాయవాది, కథానాటక రచయిత, వ్యాసకర్త, వక్త. ఆయన కథలు కన్నడ, హిందీ భాషల్లోకి వెళ్ళాయి. 32 కథలున్న ఆయన తాజా కథల సంపుటి ‘ఈ ఉదయం నాది’. ఆయన కథల్లో, కలంలో, అక్షరాల్లో హాస్యం తొణకిసలాడుతూ ఉంటుంది. ‘చీర సాగర మథనం’ అలాంటి కథే. ఒక భర్తగారికి భార్యపెట్టిన అగ్ని పరీక్షే ఈ కథ. ఆ భర్త ఆ పరీక్షలో  నెగ్గాడాలేదా అనేదే ముగింపు. నిత్యం మనచుట్టూ సమస్యలే ఉంటాయి. మచ్చుకు చూస్తే, ‘గంగిగోవులాంటి భార్య, తనకున్న అన్ని మార్గాలు మూసుకుపోయాక తెగిస్తుంది, ‘నాలాంటి ప్రేమించే భార్య కావాలంటే నన్ను వెతుక్కుంటూ రా, లేదా మరో భాసిన కావాలంటే, మళ్ళీ పెళ్ళిచేసుకో’ అని భర్తను చిన్నపిల్లాడిని మందలించినట్టు మందలించి ముందుకు కదులుతుంది. వీధిలో జనం తిరుగుతున్నారు. ఆమె వాళ్ళల్లో కలిసిపోయింది, అతడి భార్యగా కాదు, ఒక స్ర్తీగా, ఆత్మాభిమానమున్న ఒక మనిషిగా...’ అని ముగుస్తుంది టైటిల్‌ కథ ‘ఈ ఉదయం నాది’. నిజం చెప్పాలంటే, ఈ పుస్తకం పుచ్చుకుంటే ఎవరికైనా వదలబుద్ధికాదు.

 

ఈ ఉదయం నాది కథల సంపుటి
దేవరకొండ గంగాధర రామారావు
ధర : 150 రూపాయలు, పేజీలు : 202
ప్రతులకు : దేవరకొండ ఎస్‌.మూర్తి, సత్యసాయి టవర్స్‌, తణుకువారి వీధి, తణుకు–534211