ఈ తరం పెద్దాళ్లకు పాఠ్య ప్రణాళిక

కళ్ళు తెరుచుకుని చూస్తే పిల్లల ప్రపంచం ఎంత లోతైనదో, విస్తృతమైందో ఈ పుస్తకం చదివితే అర్థమవుతుంది. పిల్లలతో మనమెలా మాట్లాడాలి, ఎలా ప్రవర్తించాలనే విషయాలను నిర్మొహమాటంగా చర్చిస్తాడు రచయిత. తెల్లకాగితంలాంటి మనసుల మీద పెద్ద వాళ్ళందరూ తమకు తోచినట్లుగా అనేక మరకల్ని పూస్తారు. సహజంగా సారవంతంగా ఎదగవలసిన మొక్కల్ని కుండీల్లో కుదించి మరుగుజ్జుల్లా మార్చుతున్నట్టుగా, భావి తరాన్ని సంకుచితంగా తయారు చేస్తున్న ధోరణిని ఘాటుగా నిరసిస్తాయి ఈ వ్యాసాలు. పిల్లలలో నిజాయితీని, సృజనాత్మకతని, సందేహాలని తార్కిక శక్తిని పెద్దవాళ్లు ఎలా చిదిమేస్తారో తెలుసుకొని సిగ్గుపడతాం. రచయిత పిల్లల మనసుల్లోకి దూరి వారి స్పందనలన్నింటినీ రికార్డు చేశారు. ‘ఒక దేవుళ్ళు’, ‘ఒక నిజాలు’, ‘ఒక లాభాలు’ వ్యాసాలు చదివితే మన దిమ్మతిరిగిపోతుంది. రచయిత నిశితపరిశీలనా శక్తికి ఆశ్చర్యపోవాలి. చాలా సున్నితంగా చురకలు పెడుతూనే ఆసక్తికరమైన సంభాషనాత్మక శైలితో ఆత్మ విమర్శకు గురిచేస్తూ చెమటలు పట్టించే ఫిర్యాదుల పెట్టె ఇది.

- డా. ఎస్‌. రఘు

 

ఈ పెద్దాళ్లున్నారే ... (కంప్లైంట్‌ బాక్స్‌)
రచన : బమ్మిడి జగదీశ్వరరావు, బొమ్మలు: పి.చైతన్య
పేజీలు : 136, వెల: రూ. 80
ప్రతులకు : మంచిపుస్తకం - 94907 46614