ఇప్పుడు తెలుగు సాహిత్యంలో స్థానిక సాహిత్యాన్ని పునరుజ్జీవింప చేసే ప్రయత్నం విస్తృతంగా జరుగుతోంది. జిల్లాలు, ప్రాంతాల వారీగా.. ఆయా చోట్ల ప్రాధాన్యం ఉన్న కథల్ని సేకరించి జిల్లా కథలుగా వెలువరిస్తున్నారు. ఆ క్రమంలోనే ‘ఖమ్మం జిల్లా కథలు’ సంకలనం తీసుకొచ్చారు ప్రముఖ రచయిత జ్వలిత. తెలంగాణలో ఖమ్మం జిల్లాకు కొంత ప్రత్యేకత ఉంది. అటు ఆంధ్రప్రాంత సరిహద్దు వల్ల ఆధునికత కనిపిస్తుంది. ఇటు దండకారణ్యం వల్ల గిరిజన సంస్కృతి కూడా కనిపిస్తుంది. ఇలా ఒక మిశ్రమ వాతావరణం ఈ జిల్లాలో చూడవచ్చు. ఆ రకంగా ఇక్కడి జీవితాలు మిగతా తెలంగాణతో పోలిస్తే కొంత భిన్నంగా ఉంటాయి. అదే ఈ కథల్లో కూడా ప్రతిఫలిస్తుంది.ఈ సంకలనంలో నాటి దాశర థి సోదరుల నుంచి ఇవాళ కొత్తగా రాస్తున్న వారి కథలతో సహా మొత్తం నూట నాలుగు కథలున్నాయి. తెలుగు కథ ఆరంభమైన రోజుల్లోనే.. ఖమ్మం జిల్లాలో కూడా కథ రావడం, ఆ కథల్లో ఆధునిక లక్షణాలూ కలిగి ఉండడం ఆశ్చర్యాన్ని, ఆనందాన్ని కలిగించే విషయం. ఈ కథల్లో మైదాన ప్రాంతానికి చెందిన స్థానిక స్పృహ అధికంగా కనిపిస్తుంది. 

ఐతే ఏజెన్సీ ప్రాంతం అధికంగా ఉన్న ఈ జిల్లా నుంచి గిరిజనుల జీవితాన్ని ప్రతిబింబించే కథలు ఈ సంకలనంలో ఎక్కువ లేకపోవడం ఆశ్చర్యం కలిగిస్తుంది(శిరంశెట్టి కాంతారావు ‘పోరువనం’ కథ తప్ప). విషయ సూచికలో ఒక పేరు (భిక్షకులు), కథపేరు మరొకటి (భిక్షుణులు)ఉండడం, అక్షర దోషాలపై కొంచెం శ్రద్ధ వహించాల్సింది.జిల్లా కథలంటే ఆ జిల్లా నుంచి వచ్చిన అన్ని కథలా? లేక ఏదైనా ప్రాధాన్యం ఉన్న కథలా.? లేదా సంపాదకులకు నచ్చిన కథలా..? అనే ప్రశ్నలు తలెత్తుతాయి. జిల్లా కథల్లో సాధ్యమైనన్ని ఎక్కువ కథలకు ప్రాతినిధ్యం ఇవ్వడం మంచిదే ఐనా.. కథ ప్రమాణాల్లో లేనివాటిని కూడా చేర్చాల్సిన అవసరం ఉందా.?అనిపించక మానదు. అలాగే ఇందులో ఖమ్మం జిల్లాకు చెందిన కొందరు సుప్రసిద్ధులైన రచయితల కథలు లేకపోవడం ఈ సంకలనం పరిమితిని తెలియజేస్తోంది. రానున్న ప్రచురణల్లో వాటినీ చేర్చాల్సిన అవసరముంది. ఎన్నో వ్యయప్రయాసల కోర్చి ఖమ్మం జిల్లా కథలు సంకలనం వెలువరించిన జ్వలిత ప్రయత్నం అభినందనీయం.

- చందు

ఖమ్మం కథలు, సంపాదకురాలు: జ్వలిత,

పేజీలు : 670,వెల : రూ.400, ప్రతులకు: సెల్‌ 99891 98843