సరికొత్త జీవితానుభవాలు, వాటి తాలూకు అనుభూతుల గాఢత, కథలుగా మలిచిన తీరుతో ఆకట్టుకుంటాయి ‘కొత్త పండగ’ సంపుటిలోని కథలు. రచయిత్రి కృష్ణజ్యోతి సున్నితమైన వ్యంగ్యం, స్పష్టమైన వాక్యం, చతురతతో పాఠకుల్ని కథాలోకాల్లోకి సులభంగా తీసుకెళ్తారు. ‘కాకి గూడు’లో అత్త ఇంటిలో అస్తిత్వాన్ని నిలబెట్టుకునే కోడలు, ‘కొత్త పండగ’లో ఊరిని ఎదిరించి తండ్రికి కొరివి పెట్టిన అలివేలు, ‘సముద్రపు పిల్లాడు’లో చిన్న కుర్రాడిలోని అమాయకత్వం, పట్టపువాళ్ల జీవనం, ‘పంచమి’లో మూఢనమ్మకాల చపలత్వం, ‘బొమ్మ’లో పల్లెకు విస్తరించిన సెల్‌ఫోన్‌లోని పోర్న్‌ సంస్కృతి, ‘నేను తోలు మల్లయ్య కొడుకుని’లో నేటికీ హద్దులు చెరగని కులం.. ప్రతి కథా ప్రత్యేక ఇతివృత్తంతో, సడలని బిగింపుతో నడుస్తుంది. ఇవన్నీ నిరాదరణకు గురైన వాళ్ల కథలు, తళుక్కు మనే ఒక్క వాక్యంతో గుండెల్ని పిండేసే కథలు. వాస్తవాన్ని పహరా కాస్తూ అల్లిన కథలు. స్వచ్ఛమైన పలుకుబడి వీటికి అదనపు ఆకర్షణ.

- శ్రీ భవ్య
కొత్త పండగ (కథలు), రచన: ఎం.ఎస్‌.కె. కృష్ణజ్యోతి
పేజీలు: 136, వెల: రూ. 125, ప్రతులకు: 91107 28070