బహుజనోద్యమ సర్వస్వం

భారత సమాజంలో కులానికి ప్రత్యేక ప్రాధాన్యం ఉంది. రాజకీయాలను, ఎన్నికలను, పాలనా పద్ధతులను.. అన్ని వ్యవస్థలనూ ప్రభావితం చేస్తున్నది కుల వ్యవస్థేనని నిస్సందేహంగా చెప్పుకోవచ్చు. నాటి బుద్ధుని నుంచి నేటి వరకూ అనేక మంది కులవ్యవస్థ నిర్మూలన కోసం పోరాడుతున్నారంటే.. కుల వ్యవస్థ ప్రభావం ప్రాచీనమైనదే కాక ఎంతో ప్రధానమైనదిగా గుర్తించక తప్పదు. ఈ నేపథ్యంలో భారతదేశంలో కుల స్వరూపాన్ని, స్వభావాన్ని సమగ్రంగా పరిశీలించాల్సిన అవసరం ఉంది. అందులో భాగంగానే ‘కుల వ్యవస్థ- బీసీ సమస్య’ అనే పుస్తకం తీసుకొచ్చారు ఆయన. గతంలో దళిత ఉద్యమ సర్వస్వం తీసుకొచ్చిన పాపని నాగరాజు, తాజాగా ఈ బీసీ ఉద్యమ సర్వస్వాన్ని వెలువరించారు.

బీసీలపై జరిగిన దాడులు, హత్యలు, బహిష్కరణలు, కమిషన్‌లు, చర్చలు, రిపోర్టులు, విశ్లేషణలు... ఇలా అన్ని రకాల అంశాలకు సంబంధించిన వ్యాసాలను సర్వస్వంగా రూపొందించారు.బహుజన కులాలకు సంబంధించిన చరిత్ర, పరిణామక్రమం, బహుజన కులాలపై వేధింపులు, శ్రమదోపిడి.. లాంటి అనేక కోణాలకు సంబంధించిన చర్చ ఈ గ్రంథంలో కనిపిస్తుంది. అలాగే నూతన ఆర్థిక పారిశ్రామిక విధానాలు బహుజన జీవితాలపై ఎటువంటి దుష్ప్రభావాన్ని చూపాయో విశ్లేషించారు. రాజ్యాధికారం దిశగా బహుజనులు రూపొందించాల్సిన రాజకీయ కార్యక్రమాలపైనా సూచనలు, మార్గనిర్దేశాలు కనిపిస్తాయి. మనదేశంలోని సంక్లిష్టమైన నిచ్చెన మెట్ల బ్రాహ్మణీయ కులవ్యవస్థను అర్థం చేసుకునేందుకు ఈ పుస్తకం దోహదపడుతుంది. బీసీ ఉద్యమం గురించి తెలుసుకోవాలనుకునే ఔత్సాహికులకు, ఉద్యమకారులకు, కార్యకర్తలకు, రాజకీయ సంఘాలకు ఈ బహుజన సర్వస్వం ఎంతగానో ఉపయోగపడుతుందనడంలో సందేహం లేదు. బీసీ రిజర్వేషన్‌ కోసం.. ఇతర వర్గాలు రాజకీయోద్యమాలు చేస్తున్న తరుణంలో ఇటువంటి పుస్తకాలు రావడం ఎంతైనా అవసరం.

- చందు

కుల వ్యవస్థ- బీసీ సమస్య (నేపథ్యం-అస్తిత్వం-ఉద్యమం),

సంపాదకులు: పాపని నాగరాజు

పేజీలు : 995, వెల : రూ. 1000, ప్రతులకు: సెల్‌ 99488 72190