అణగారిన ముస్లిం మహిళల వెతలు
కవిత, కథ, వ్యాసం .. ప్రక్రియ ఏదైనా భావాన్ని సూటిగా, పదునుగా చెప్పగల కలం షాజహానాది. ముస్లింలలోని అట్టడుగు వర్గాల స్త్రీల సమస్యలను ప్రధాన ఇతివృత్తాలుగా తీసుకుని ఆమె వెలువరించిన కథా సంపుటి ఇది. ఖాదర్‌ మొహియుద్దీన్‌ ‘పుట్టుమచ్చ’ తర్వాత ముస్లిం సాహిత్యంలో అంతటి ప్రభావాన్ని వేయగలిగిన రచన ఇది. వివక్షను ఎదుర్కొనే బాధితులు సైతం తమ కిందివారి పట్ల అదే వివక్షను చూపడంలోని ద్వంద్వ విలువలను ఆమె ఈ కథల్లో బలంగా ఎండగట్టారు. 
కరీంబీ అనే పేద దూదేకుల మహిళ కథ ‘సిల్‌సిలా’. గ్రామీణ ప్రాంతపు అణగారిన వర్గానికి ప్రతీక ఆమె. మతం ఒకటే అయినా ఆహార్యంలోగానీ, ఆహారంలోగానీ ముస్లింల జీవితాలతో ఆమె జీవితానికి పొంతన ఉండదు. కుల, వర్గ, మతాలకు అతీతంగా శ్రామిక వర్గాల జీవితాల్లోని కష్టాల యూనిఫార్మిటీని బయట పెడుతుంది ఈ కథ. ‘సెండాస్‌’ అనే మరో కథలో గ్రామీణ మహిళలు ఎదుర్కొనే బహిర్భూమి సమస్యను తీసుకున్నారు. ఇటీవల పత్రికల్లో, ప్రసార మాధ్యమాల్లో ఇంటింటా మరుగుదొడ్డి ఉండాలనే ప్రకటనలు వస్తున్న నేపథ్యంలో పుష్కరం కిందటే ఈ సమస్యను తీసుకుని కథ రాయడం గమనార్హం. నాగరీక సమాజానికి రోతగా కనిపించే సమస్యలో దాగిన వేదనని ఆర్ద్రతగా అక్షరీకరించారు.
షాజహానా కథా వస్తువులు వేర్వేరు అనిపించినా నిశితంగా పరిశీలిస్తే పూలదండలో దారంలా ‘ఇంటర్‌లింక్డ్‌’ అంశాలు అనేకం ఉంటాయి. ‘ఖతీజా’, ‘గఫూరి’ కథల్లో ఆర్థిక నిస్సహాయతను ఆసరా చేసుకుని లోబరుచుకునే పెత్తందారీ కులాల తీరుతెన్నుల్ని ఎండగడితే, ‘నేను’ కథలో ప్రేమ రాహిత్యంలో దేహ లాలస తీర్చుకునే అంశాన్ని లేవనెత్తి ఒక చర్చకు తెర తీశారు. ‘టిఫిన్‌ బాక్స్‌’, ‘బిల్లి’ కథల్లో సామాజిక అంతరాలను ఉటంకిస్తూ ఆహారపు అలవాట్లు కూడా వ్యక్తులను ఎలా వేరుచేస్తాయో చెప్పారు. కథలన్నిట్లో అస్తిత్వపు వెతుకులాటతో పాటు సామాజిక స్పృహ మెండుగా కనిపిస్తుంది. 
- గోవర్ధనం కిరణ్‌కుమార్‌
లద్దాఫ్ని, ముస్లిం స్త్రీ కథలు, డా. షాజహానా
పేజీలు : 116, వెల : రూ. 100, ప్రతులకు : 77990 59494