ప్రపంచవ్యాప్తంగా తెలుగువారిని ఉర్రూతలూగించిన కథలు ‘మా తిరుపతికొండ కథలు’. రచయిత గోపిని కరుణకర్‌ రాసిన ఈ కథలను బాపూగారు ఎంతో ఇష్టపడ్డారు. రచయితను ఆశీర్వదించి గీసిచ్చిన ఆయన ఆఖరి బొమ్మల్లో ఒకటి ఈ పుస్తకం కవర్‌పేజీ బొమ్మ. 

ఒక ప్రముఖ దినపత్రిక ఆదివారం సంచిక ‘ఫన్‌ డే’లో తొమ్మిదేళ్ళక్రితం వచ్చిన ఈ పదహారు కథలూ పాఠకుల విశేష ఆదరణ చూరగొన్నాయి. మరింతమంది పాఠకులకు ఈ కథల్ని చేరువ చేయాలనే ఆపేక్షతో ‘కథాప్రపంచం’ ప్రచురణకర్త తిరుపతి కిరణ్‌ ఇప్పుడు వీటిని పుస్తకరూపంలోకి తెచ్చారు. పాఠకులతోపాటు ‘‘ప్రపంచస్థాయి ప్రసిద్ధ కథలతో సమానమైన గౌరవం పొందిన కథలివి’’ అంటూ ‘చేయి తిరిగిన సాహితీ విమర్శకుల ప్రశంసలందుకున్నారు తిరుపతి వాసి గోపిని కరుణాకర్‌. 

తన బాల్యంనాటి పురాతన తిరుమల భక్తజన సందోహం, నాటి భక్తిభావం, నాటి ప్రకృతి జ్ఞాపకాలూ, ఈనాటి పోలీసు కాపలాలు, హంగులు, ఆర్భాటాల వైరుధ్యాల్ని కళ్ళకు కట్టే కథలివి. పడమటి మాడవీధిలో గార్డెన్‌ప్లేస్‌లో ఒకప్పటి ఊరు జ్ఞాపకాలు, తన ఇల్లున్న ప్రదేశం, ఎమ్మెస్‌ సుబ్బలక్ష్మి బసచేసే వైఖాన ఆశ్రమం గుర్తులు, పడమటి మాడవీధిలో ఉండే ఆలిండియా వైశ్యుల సత్రంలో జరిగిన జమున పెళ్ళి సందడి, ఆ పెళ్ళిలో హాస్యనటుడు రమణారెడ్డి చేసిన మ్యాజిక్‌ షో, భక్తి ప్రపత్తులతో వాటర్‌మెన్‌ శంకర్‌రెడ్డి చేసే జలయజ్ఞం, పనసకాయ దొంగలు, ముత్యాలముగ్గు సినిమాచూసి కోతిని సంపాదించేందుకు రచయిత పడిన తిప్పలు...ఇలా ప్రతి కథా వస్తువు కట్టిపడేసే శిల్పంతో అలరిస్తాయి. ముందుమాటలో పెద్దలు చెప్పినట్టు తెలుగువారి కథలు జాతీయపురస్కారాలకు, అంతర్జాతీయ స్థాయి గౌరవానికీ తీసిపోవని చాటే కథలివన్నీ. 


మా తిరుపతికొండ కథలు

గోపిని కరుణాకర్‌
ధర 200 రూపాయలు
పేజీలు 116
ప్రతులకు కథాప్రపంచం, ఇస్కాన్‌ టెంపుల్‌వద్ద, కె.టి.రోడ్‌, తిరుపతి సెల్‌ 9553518568 వెబ్‌సైట్‌ www.kathaprapancham.in మరియు తెలుగు రాష్ర్టాల్లోని ప్రముఖ పుస్తక దుకాణాలు.