కేంద్రసాహిత్య అకాడమీ, తెలుగు విశ్వవిద్యాలయ సాహితీ, మరెన్నో సాహితీ పురస్కారాల గ్రహీత సయ్యద్‌ సలీం. ఆయన కలం నుంచి జాలువారిన మరో నవలా కుసుమమే ‘పడిలేచే కెరటం’. దివ్యాంగుడైన సాగర్‌, కృషి పట్టుదలతో పేదరికాన్ని జయిస్తాడు. తనతోపాటు తనచుట్టూ ఉన్నవారిని కూడా ఆదుకుని అంగవైకల్యం కంటే, రకరకాలపేర్లతో సాటిమనిషిని అవమానించే మనోవైకల్యమే అత్యంత ప్రమాదకరమని నిరూపించిన సాగర్‌ ఆత్మకథే ఈ నవల. సముద్రంలోని కెరటాలు ఎలా అలుపెరుగకుండా తీరం చేరేందుకు ప్రయత్నిస్తాయో, వాటి ప్రేరణతో జీవితంలో ఎదురయ్యే కష్టాలను జయిస్తూ విజయతీరాన్ని ఎలా చేరుకున్నాడో సాగర్‌లోని అంతరంగ కల్లోలాన్ని అక్షరబద్ధం చేస్తూ అద్భుతంగా వివరించారు. అంగవైకల్యంతో ఉన్న వ్యక్తుల విషయంలో మన సమాజంలో ఉన్నంత ఇన్‌సెన్సిటివ్‌గా మరే ఇతర దేశంలోనూ ఉండరేమో అనే విషయాన్ని ప్రతి సంఘటనలోనూ చక్కగా విశదీకరించారు రచయిత. అంగవైకల్యం ఉన్న వ్యక్తుల హృదయాల్లో వేదనా సముద్రాలు ఎగిసిపడ్తుంటాయి. దివ్యాంగుల ప్రతిభాపాటవాలకు, వైకల్యానికీ ఎంతమాత్రం సంబంధంలేదనీ, వారిని అత్యున్నతమైన ప్రతిభావంతులుగా గుర్తించాలనీ చెప్పిన నవల. ఈ నవల చదివితే దివ్యాంగులపట్ల మనలో మార్పు రావడం తథ్యం.

ధర: 200 రూపాయలు, 

పేజీలు: 366

ప్రతులకు: జ్యోతి వలబోజు, జె.వి. పబ్లికేషన్స్‌,

‍సెల్‌: 80963101040మరియు అన్ని ప్రముఖ పుస్తక దుకాణాలు

 

 

 

 ‍