ప్రసాదమూర్తి తనదైన ఒక స్వంత గొంతుక ఉన్న కవి. లలితలలిత మృదు భావస్పర్శతో కవిత్వ పంక్తులను రసమయం చేయడం అతనికి బాగా తెలుసు. పుట్టిన ప్రతి మనిషీ తప్పనిసరిగా తన అస్తిత్వం కోసం ‘హోం వర్క్’ చేయాలని చెబుతూ నువ్వెందుకొచ్చావో నీకెవరూ చెప్పరు/తల్లిదండ్రులే కాదు/నీ పుట్టుక కోసం నరాలు తెంచుకున్న/తరాల మానవ చరిత్ర ఒకటి వుంది/... నీలాంటి నాలాంటి మామూలు మనుషుల్ని కూడా/నింగి నేలా రెండు కళ్ళయి చూస్తూంటాయి (హోం వర్క్); మామూలు మనిషి చరిత్రకు ప్రతీకైన ‘తాత’ను పరిచయం చేస్తూ ‘ఈసారి నీ కోసం ఓ గుర్రాన్ని తెచ్చి/నీ చేతుల్లో ఖడ్గాన్ని పెట్టి నీతో దౌడు తీయిస్తా/తిరుగబడ్ద భూమిలోంచి సామాన్యుల కళేబరాలు/కొత్త పుస్తకాలుగా పూచిన చెట్లై మొలుచు కొస్తాయి/పొడిచే సూర్యోదయాలన్నీ నీ నుదుటి మీదే తాతా! (తాత కోసం) ... ఇటువంటి మనసును కదిలించే వాక్యాలు ఈ పుస్తకంలో కోకొల్లలు.
-రామా చంద్రమౌళి
ప్రసాదమూర్తి కవిత్వం (ఎంపిక చేసిన కవితలు),
రచన: ప్రసాదమూర్తి
పేజీలు: 213, వెల: రూ 150,
ప్రతులకు: 84998 66699