అచ్చమైన తెలుగు హాస్యం
నేనింకా ‘నా’ నుంచి ‘మా’ వరకే రాలేదు. ‘మన’ అనుకున్నప్పుడు కదా ముందడుగు... అన్నారు కాళోజీ మహాకవి.
ఏదైనా సరే వ్యష్టి నుండి సమష్టి కావడం గొప్ప. అదే అసలు విజయం. హాస్యమైనా అంతే. సరసి ఆ ‘విజయుడు’. ‘మనమీదేనర్రోయ్’ అంటూ పుష్కరకాలంగా నవ్య వారపత్రికలో వారం వారం పుష్కలంగా నవ్వులు పండిస్తున్న ఈ కార్టూనిస్టు చిడుముడుల కాలాన్ని ‘నవ్వేడేస్’గా మార్చేయగల ప్రాజ్ఞుడు. అందుకే తెలుగునాట సరసి‘జనాభా’ పెరిగిపోతోంది. ఇంత తెలివిగల కార్టూనిస్టుని ఇటీవల చూడలేదు అని ‘బాపు’గారి కితాబుని అందుకుని చాలాకాలమైనా, సరసి ఇప్పటికీ అది నిలుపుకోగలగడం అసలైన ప్రతిభ. ‘ప్రతిభానవనవోన్మేషశాలినీ’ అని ఆలంకారికులు ఊరికే అనలేదు. కార్టూన్లు కేవలం అలంకారం కోసమే కాకుండా, అస్మదీయులనూ, తస్మదీయులనూ కూడా సమానంగా నవ్విస్తూనే ఆలోచింపచేసేవిగా చేసి, కుంచించుకుపోతున్న హాస్యాన్ని తన కుంచెతో పెంచి, కంచెవేసి కాపుకాస్తున్న వాడు ఈ సరస్వతుల రామనరసింహం... ఉరఫ్ ‘సరసి’.
‘హాస్యంబునకు దేశకాల పాత్రంబులు లేవా?’ అన్నారు తిరుపతి వెంకటకవులు. లేకేం? ఉంటే ఉండొచ్చుగానీ, ఈ కార్టూన్లలోని దేశం, కాలం, పాత్రలూ అన్నీ ఇంత అచ్చమైన తెలుగుదనంతో భాసింపజేయడం సరసికే చెల్లింది. సమకాలీనతను హాస్యానికి ఆలంబన చేస్తూనే, వాటికి ఓ కాలాతీత పరిమళాన్ని అద్దడం అసలైన తెలివి! అందుకే సరసి కార్టూన్లు ఈ రెండు సంపుటాల్లోవీ... ఎప్పుడు చూసినా అచ్చమైన తెలుగు హాస్యానికి శాశ్వత చిరునామాలా అలరించి ఆనందింపజేస్తాయి.
- సుధామ
సరసి కార్టూన్లు- ‘మనమీదేనర్రోయ్’ (రెండు సంపుటాలు)
పేజీలు : 212+212 , వెల : రూ. 120+120
ప్రతులకు : క్రియేటివ్ లింక్స్ సెల్ : 98480 65658,
రచయిత సెల్ : 94405 42950