శిఖరారోహణ ప్రయత్నం!తన చుట్టూ ఉన్న పరిసరాలను శ్రద్ధగా గమనిస్తూ, సామాజిక స్థితిగతులపై స్పందిస్తూ విభిన్న జీవన కోణాన్ని ఆవిష్కరించే ప్రయత్నమే నంబూరి పరిపూర్ణగారి ‘శిఖరారోహణ’ సంకలనం. 12 కథలు, 35 వ్యాసాలు ఇందులో పొందుపరిచారు. కథలన్నిటా మధ్యతరగతి మానవ సంబంధాల దెబ్బతిన్న విలువలపై విచారం కనిపిస్తుంది. కథాంశాలను కొన్నిచోట్ల సాగదీసిన ఫీలింగ్‌ వస్తుంది. చక్కటి తెలుగు వచనం చకచకా చదివించగలిగినా చివరికొచ్చేసరికి కొన్ని కథల్లో పాఠకులకు ఇదంతా తెలిసిందే కదా అన్న చిన్నపాటి విసుగు వస్తుంది. అలా అని నిరాశ మాత్రం కలగదు. మొదటి కథ ‘శ్రుతి తప్పిన రాగం’ దీనికి ఉదాహరణ... ‘సరికొత్త దృశ్యం’ కథలో పాత కోణాన్నే కొత్తగా ఆవిష్కరించారు. ‘ఇంకెన్నాళ్ళీ ఆత్మహననం రామా!’ కథ ఖచ్చితంగా కొందరి నమ్మకాలను ఎద్దేవా చేస్తుంది. నమ్మకానికి జీవితానికి ఉన్న సన్నటి రేఖపై సాహసోపేత విన్యాసం ఈ కథ! ఇలాగే ఇందులో కొన్ని కథలు అలరిస్తాయి. మరికొన్ని విసిగిస్తాయి.

మొత్తం మీద ఓ వినూత్న అనుభూతి మాత్రం కలిగిస్తాయి. ఇక ఇందులోని వ్యాసాలు దేనికవే కొత్త ప్రశ్నలు రేకెత్తించేలా ఉన్నాయి. సంస్కృతి-మానవత-సామాజిక బాధ్యత-వెర్రి నమ్మకాలు-దురాచారాలు... ఇలా విభిన్న జీవన కోణాల లోని వర్తమాన జీవన దృశ్యాలను ఇవి ఆవిష్కరిస్తాయి. పలు రకాల స్త్రీ సమస్యలను కొన్ని వ్యాసాలలో సాహసోపేతంగా వ్యాఖ్యానించారు. ఆగ్రహానికీ ఆవేదనకు నడుమ అభిప్రాయాలను పేర్చి రచయిత్రి నంబూరి పరిపూర్ణ... అసంపూర్ణంగా అయినా కొన్ని నిజాలు చెప్పకనే చెప్పారు. కాలక్షేపం కోసం అయితే ఖచ్చితంగా ఈ సంకలనంలోని రచనలు బోర్‌ కొడతాయి. కాస్తంత వ్యక్తిత్వ హక్కుల పట్ల స్పృహ, చైతన్యం కలిగిన పాఠకులను ఈ రచనలు మెప్పిస్తాయి.

- వల్లూరి

శిఖరారోహణ, నంబూరి పరిపూర్ణ

పేజీలు : 280, వెల : రూ.150, ప్రతులకు : 040-23065750