కథాగానానికి సరికొత్త స్వరం
 
ఆధునిక తెలుగు కథా సాహిత్యాన్ని కొత్త దృక్పథంతో పుంతలు తొక్కిస్తున్న బలమైన కలం వేంపల్లె షరీఫ్‌. కథా వస్తువు ఎంపికతో పాటు కథనరీతుల్ని సులువుగా చెప్పగల సామర్థ్యం పుష్కలంగా ఉండడం షరీఫ్‌కు తెలిసిన విద్య.

అందుకే ఈ పదకొండు కథల్లో ఎక్కడా సంక్షిష్టతలుండవు. అర్ధంకాని వాదప్రతివాదాలుండవు. భావజాలాల గొడవలు కాని, భావగర్భితమైన అన్వయాలుకాని కనిపించవు. కథల్లో సింహభాగం ఒక వర్గం జీవనవైవిధ్యాన్ని లోతుగా తాదాత్మ్యంతో, సానుభూతిగా, అనుభూతితో ఆస్వాదించి రాసినవే. సమాజ మూలాల్ని తటస్థ వైఖరితో గమనించాడు కనకనే ‘అమ్మబొమ్మ’లో అమ్మకు మతాల రంగుపూయడం సుతరామూ తగదని సుతిమెత్తగా సున్నిత హృదయాలకు అర్థమయ్యేలా చెబుతారు రచయిత. ‘దారితప్పిన కల’ పైకి ముస్లిం స్త్రీల ఆత్మగౌరవానికి సంబంధించిన అంశంగా కనిపించినా ‘జీవితాంతం క్రీస్తు శిలవ మోసినట్టు నీళ్లు మోస్తూ ఉండాల్సిందే’ అంటూ రాయలసీమ తరతరాల క‘న్నీటి’ వ్యథని గుర్తుకుతెస్తుంది. అంతేకాదు మతాంతర వివాహం చేసుకున్న కూతురుకు నీళ్లు తేవాల్సిన రోజువారీ కష్టం నుంచి కనీసం ఉపశమనం పొందడానికైనా అల్లుడు గోషా పెడతాడా? అని కన్నతల్లి పడ్డ మూగవేదన మాతృమూర్తి హృదయాన్ని ఆవిష్కరిస్తుంది. 

 

‘టోపీ జబ్బార్‌’ కథలో తెలిసీ తెలియని ప్రేమమథనం కనిపిస్తున్నా .. సమాజంలో ఎదురయ్యే వివక్ష, అవమానాలు, అస్థిత్వానికి కాపాడుకునేందుకు జబ్బార్‌ పడిన అవస్థలు అంతర్లీనంగా మన గుండెల్లో గునపాలు దించుతునే ఉంటాయి. కులవృత్తుల దోపిడీ, అన్యాయాలను ధైర్యంగా ఎదుర్కోవడం ఎలాగో చెబుతుంది ‘తలుగు’ కథ. పిల్లల్ని శిక్షించే లేదా శిక్షించడానికి సిద్ధపడ్డ తల్లిదండ్రులకు కనువిప్పు కావాలంటే ‘ఒంటిచెయ్యి’ చదివి తీరాల్సిందే.
మీడియా ప్రహసనాన్ని వ్యాఖ్యానించే ‘వింతశిశువు’, వర్తమాన రాజకీయ పరిస్థితులకు దర్పణం పట్టే ‘దహనం’ ... ఇలా ఒక్కో కథా ఒక్కో ఆలోచనా తీరంలో మనల్ని కట్టి పడేస్తాయి. జీవన దృశ్యాల ఆత్మీయ స్వరం వినాలంటే  ‘టోపీ జబ్బార్‌’ కథలు చదవితీరాల్సిందే!
                                                                                                                                    -బొబ్బిలి శ్రీధరరావు

టోపీ జబ్బార్‌ కథలు
వేంపల్లె షరీఫ్‌
పేజీలు : 142, వెల: రూ. 125
ప్రతులకు : 96034 29366,
ప్రముఖ పుస్తక కేంద్రాలు