తెలుగువారికి ఆవకాయనీ, గోంగూరనీ పరిచయం చెయ్యాలా? ఉషశ్రీ గురించిన పరిచయం కూడా అంతే. తెలుగునాట రేడియో స్వర్ణయుగవైభవాన్ని శిఖరస్థాయికి చేర్చిన దిగ్దంతులలో అగ్రతాంబూలం ఆయనదే అనడం అతిశయోక్తికాదు. ఆయన జ్ఞాపకాలు, ఉపన్యాసాలు, పుస్తకాలు వివిధ రూపాల్లో ప్రజలకు ఉషశ్రీ మిషన్ ద్వారా ఇప్పటికే అందుబాటులో ఉన్నాయి. ఆయనగురించి మళ్ళీచెప్పడం దేనికంటే ఆయన మేన–అల్లుడు అనామకుడు సరికొత్త కోణంలో సాధికారికంగా ఆవిష్కరించిన ‘ఉషశ్రీ ఇంతింతై వటుడింతయై’ పుస్తకం కాబట్టి. అనామకుడు రాసిన...కాదు కాదు, ఆయన సతీమణి–ఉషశ్రీ కుమార్తె డాక్టర్ గాయత్రీదేవి, ఉషశ్రీ సోదరిసహా రక్తసంబంధీకుల ఆలోచనలకు అక్షరరూపమీ పుస్తకం.
ఉషశ్రీ బాల్యం, సాహితీ విజయయాత్ర, మహాత్మాగాంధీ అంతిమయాత్రకు ప్రత్యక్ష ప్రసారం చేసిన డిమెల్లో మాటలతో స్ఫూర్తిపొంది అసామాన్యవక్తగా ఎలా ఎదిగిందీ ఈ పుస్తకంలో మనం చదువుకోవచ్చు. ఉషశ్రీ అంటే సంప్రదాయం+విప్లవం అని వింటే మనకే ఆశ్చర్యం కలుగుతుంది. భగవద్గీతనీ, సుందరాకాడనీ అందరికీ అర్థమయ్యేలా చేశారాయన. ఆయన అసంపూర్ణంగా వదిలేసిన ‘రామాయణంలో హనుమంతుడు’ పుస్తకాన్ని ఆయన కుమార్తె గాయత్రీదేవి పూర్తిచేసి తెలుగువారికి అందించడం ఉత్తమ సంస్కారానికి చిహ్నమే. ఈ సరికొత్త పుస్తకం కూడా ఆ వారసత్వాన్ని ఓ కొత్త కోణంలో మరోసారి మనకళ్ళకు కట్టేదే.
ఉషశ్రీ...ఇంతింతై వటుడింతయై
రచన అనామకుడు (ఉషశ్రీ మేన–అల్లుడు)
ధర 200 రూపాయలు
పేజీలు 140
ప్రతులకు అన్ని ప్రముఖ పుస్తక దుకాణాలు మరియు ఉషశ్రీ మిషన్ సెల్ 9848598797