ఎగరేసిన దళిత పతాక
 
 

‘‘సహస్రాబ్ది అంచున దళిత సూర్యుణ్ణై ఉదయిస్తున్నా’’ అని ప్రకటించుకున్న కవి శిఖామణి. ఆయన కలానికి రెండంచుల పదును. ఒకవైపు సౌకుమార్యపు భావనలు దండిగా పండించగల పదును. మరోవైపు దళిత గొంతుక పెను గర్జనగా భాసిల్లే పదును. గుండెని మండించే సంఘటన ఎదురైనా, మదిలో ఓ దళిత స్ఫురణ మొలకెత్తినా - శిఖామణి కలం అక్షరసేద్యంలోకి దిగుతుంది. చేవ కలిగిన కవిత్వపు పంట పండిస్తుంది. ఇలా గత మూడు దశాబ్దాలుగా శిఖామణి రాసిన దళిత కవితలన్నీ ఇప్పుడు ఒకే కూర్పుగా మారి పాఠకుల ముందుకొచ్చింది. ‘శతాబ్దాల కుల వివక్షను ఎదిరించే/ శతకోటి గొంతుకల దళిత కోరస్‌’ ఇది. వర్తమాన సాహిత్య, సామాజిక సందర్భంలో ఈ సంపుటి ఆవశ్యకత ఎంతో ఉంది. 

 

‘మువ్వల చేతికర్ర’ సంపుటితో 1987లో మొదలైన శిఖామణి కవితా ప్రస్థానం రెండేళ్లకే కొత్త మలుపు తిరిగింది. 1989లో కర్ణాటకలో దేవాలయ ప్రవేశం చేసిన దళితుడికి మలం తినిపించారన్న ఒక వార్త ఆయనను తీవ్రంగా కలచివేసింది. సంఘర్షణకి గురిచేసింది. ఆ నేపథ్యంలోనే ‘వాడే అశుద్ధ మానవుడు’ శీర్షికన ఓ కవిత రాశారు. అప్పట్లో అదొక పెను సంచలనం. తెలుగునాట దళితవాద సాహిత్యం అంతగా పుంజుకోని కాలంలోనే ఆయన గొంతెత్తారు. క్రమేపీ ఆ వాహిక బలపడి నేడు ఈ స్థాయికి చేరడంలో తనవంతు పాత్ర నిర్వర్తించిన అగ్రశ్రేణి దళితకవులలో శిఖామణి కూడా ఒకరయ్యారు. జాతీయ దళిత కవుల కోవలో స్థానం సంపాదించుకున్నారు. 
కారంచేడు నరమేధం జరిగి ముప్పయ్యేళ్లయిన సందర్భంగా రాసిన ‘మూడు పదుల రుధిరక్షేత్రం’ కవిత ఈ సంపుటిలో చివరిది. మధ్య పేజీలలో లక్ష్మింపేట, ప్యాపిలి ఘటనల సెగ తగులుతుంది. ప్రజావాగ్గేయకారుడు గద్దర్‌పై హత్యాయత్నం జరిగి పదేళ్లయిన సందర్భంగా రాసిన ‘ఒక గాయం- పది వసంతాలు’ కవిత పాఠకుల గుండెచప్పుడుగా మారుతుంది. సామాజిక ఘటనలపై రాసిన కవితలే కాదు - దళిత జీవితాన్ని దర్శింపచేసే కవితలెన్నో ఈ సంపుటిలో ఉన్నాయి. 
- రమేష్‌బాబు
 
చూపుడువేలు పాడే పాట
(శిఖామణి దళిత కవిత్వం)
పేజీలు: 176 వెల: రూ.150 
ప్రతులకు: అన్ని పుస్తకాల షాపులు