దర్జీల బతుకు చిత్రం
 
ప్రపంచీకరణ మిగిల్చిన అనేక విషాదాల్లో స్థానిక వృత్తుల విధ్వంసం ప్రధానమైనది. తాతల కాలంనుంచి ఉపాధి చూపిన వృత్తిని వదులుకోలేక, మరో వృత్తిలోకి మారలేక ఆయా వర్గాల ప్రజలు ఎదుర్కొన్న సంక్షోభం, సంఘర్షణ నేపథ్యంగా విస్తృతంగా సాహిత్యం వచ్చింది. ఐతే బయటి వ్యక్తుల కన్నా బాధితులే తమ అనుభవాల్ని సాహిత్య రూపాల్లోకి మార్చినపుడు ఆ రచనకు జీవం వస్తుంది. అటువంటిదే వి.వెంకట్రావు రాసిన ‘మారిపోయెరా కాలము’ నవల. ఈ రచయిత స్వయంగా దర్జీ.
ఆర్థిక సంస్కరణల ఫలితంగా బతుకు తెరువు కోల్పోయిన  నారాయణ అనే ఒక టైలర్‌ జీవిత ప్రయాణం ఈ నవల. దర్జీల జీవితాల్లోని అన్నికోణాల్నీ ఈ నవలలో చూపించారు. 1970ల్లో టైలర్లకు స్వర్ణయుగం లాంటి దశ నుంచి ఆధునిక సంక్షోభ కాలం దాకా ఈ నవల సాగుతుంది. అప్పటివరకు కంటి నిండా కునుకు దొరకని నారాయణకు రెడీమేడ్‌ షాపుల రాకతో గిరాకీలు తగ్గిపోతాయి. అప్పటికే పీకల్లోతు కష్టాల్లో ఉన్న అతనికి రోడ్డు ప్రమాదం కావడంతో ఆశ్రయం కోసం హైదరాబాద్‌లో ఉన్న కొడుకు దగ్గరకు వస్తాడు. అక్కడ ఎదురైన అనుభవాలే కొత్త ప్రపంచాన్ని చూపిస్తాయి. తనలాగే ఉపాధి కోల్పోయిన స్వర్ణకారుడు ఆచారి పాత్ర ప్రపంచీకరణ అసలు గుట్టును, కారణాల్ని వివరించి తలకిందుల సమాజాన్ని అర్థం చేసుకునేలా చేస్తుంది.
రచయిత కేవలం సమస్యను ఏకరువు పెట్టడమే కాదు, సంక్షోభానికి కారణాల్ని, పరిష్కారాల్ని చూపడానికి ప్రయత్నించారు. అసహజ పాత్రలూ, కల్పించిన మలుపులూ లేకుండా ఒక టైలర్‌ తన జీవితం గురించి మనతో భావాలను పంచుకున్నట్లుగా రచయిత శైలి సాగుతుంది.  ‘అందరూ సంతోషంగా ఉంటే కాలానికి అసూయ. త్వరగా కరిగిపోతుంది..’ ; ‘పని చేస్తే మనిషి అవసరాలు తీరడమే కాదు, మనుషుల మధ్య వైషమ్యాలు కూడా తగ్గిపోతాయి ...’ లాంటి దాచిపెట్టుకోదగిన వాక్యాలు చాలా ఉన్నాయి.ఐతే విజయనగరం నేపథ్యంగా సాగే నవలలో ఆ ప్రాంతపు మాట తీరు, పలుకుబళ్లను మరింతగా వాడుకుని ఉంటే బాగుండేది.   
 - చందు తులసి
మారిపోయెరా కాలము 
వి. వెంకట్రావు
పేజీలు : 216, వెల: రూ.80
ప్రతులకు: 92472 35401