అనుభవాల నివేదనే ఈ రుబాయిలుకవిగా, విమర్శకులుగా ఏనుగు నరసింహారెడ్డి తెలుగు సాహితీ ప్రపంచానికి చిరపరిచితులు. మూడేళ్లపాటు ఆంధ్రప్రభ ‘సాహితీ గవాక్షం’లో రాసిన ‘తెలంగాణ రుబాయిల’ను పుస్తకరూపంలో తీసుకొచ్చారు. అందమైన భావం, అరుదైన వ్యక్తీకరణ, శ్రమైక స్త్రీ సౌందర్యం, సమాజ చిత్రణ, వ్యక్తిత్వవికాసం, ప్రకృతి ప్రేమ, మార్మికత, తెలంగాణ సంస్కృతి, నుడికారాల సోయగం, సున్నితమైన వ్యంగ్యాలతో ఈ రుబాయిలు మనసుల్ని కట్టిపడేస్తాయి. కవిత్వ లక్షణాల్ని, ప్రకృతి సమతౌల్యాన్ని, జీవన సూక్తుల్ని సంవిధానం చేస్తూ ‘‘వచనం ఎక్కువైతే కవితా తగ్గుతుంది / భాష్యం ఎక్కువైతే భావనా తగ్గుతుంది / మొక్కకు నీరుండాలి; ముంచేట్టుగా కాదు / సంపదలెక్కువైతే ప్రేమా తగ్గుతుంది’’ అంటారు ఈ కవి. అలాగే పదాల కూర్పు, మాత్రాఛందస్సు, రుబాయి లక్ష్య లక్షణ సమన్వయాన్ని సంపూర్ణంగా పట్టుకున్న నరసింహారెడ్డి ‘రుబాయీలు రాయడమొక మజాకు కాదు / రదీఫూను కాఫియాను అల్లుడు కాదు / పట్టరాని చేపపిల్లలంటి ఊహలు / మాత్రల్లో పరుగు తీయ సడాకు కాదు’ అని వర్ణిస్తారు. ఇప్పటివరకువియోగ శృంగారాన్ని, ఆరాధనా భావాన్ని మత్రమే ఎక్కువగా ప్రతిబింబించిన రుబాయిలలో అన్ని రకాల ఇతివృత్తాలను పలికించారు. ‘వలయం లోపల వలయం’, ‘దూదిపింజలాంటి నవ్వు’, ‘తూర్పు తేనె’, ‘ఎర్రెర్రని చెల్కల్లో’, ‘ఎత్తొంపుల నేలల్లో’, ‘వరణ భంగం’, ‘కౌశల’, ‘పుడమి అంచులు’ వంటి శీర్షికల్లోని రూబాయిలు కళాత్మకంగా ఆకట్టుకుంటాయి. ప్రముఖ కవి, విమర్శకులు పెన్నా శివరామకృష్ణ రాసిన ముందుమాట రుబాయిల చరిత్రకు చిక్కని చుక్కాని లాంటిది. కొత్తదనాన్ని కోరుకునే పాఠకులకు తేనె పట్టులాంటిదీ పుస్తకం.