నాగేశ్వరరావుగారిలా డ్రస్సులు వేసుకునేవాడిని

హీరో కావాలనే లక్ష్యంతో మద్రాసులో అడుగుపెట్టాడాయువకుడు. ఐతే అతను హీరోకు బదులు డైరెక్టర్‌ కావడం విధి లిఖితం. చిన్నప్పుడు తను అభిమానించిన అక్కినేని నాగేశ్వరరావునే డైరెక్ట్‌ చేశాడు. అంతే కాదు చిరంజీవి, మోహన్‌బాబు, బాలకృష్ణ, నాగార్జున..ఇలా అగ్రహీరోలందరితోనూ సినిమాలు చేశాడు. ఆ సినిమాల్లో అధిక శాతం హిట్లే! కమర్షియల్‌ సినిమాకు కేరాఫ్‌ అడ్రెస్‌గా మారిన ఆ యువకుడి పేరు ఎ. కోదండరామిరెడ్డి.తను హీరో కాకపోయినా కొడుకు వైభవ్‌ను హీరోగా పరిచయం చేసి కోరిక నెరవేర్చుకున్నారు. సమాజంలో తనకంటూ ఓ గౌరవాన్ని తీసుకువచ్చింది సినిమాలే అని వినయంగాచెప్పే కోదండరామిరెడ్డి జ్ఞాపకాల ముచ్చట్లు ఈ వారం నుంచి..

ఎందరో సినీ ప్రముఖులను తెలుగుతెరకు పరిచయం చేసిన నెల్లూరు ప్రాంతానికి చెందినవాడినే నేను కూడా. ఆ విషయం చెప్పుకోవడానికి గర్వపడుతూ ఉంటాను కూడా. ఆ జిల్లాలోని మైపాడు నా స్వగ్రామం.మాది మధ్యతరగతి వ్యవసాయ కుటుంబం. నాన్న వెంకురెడ్డి, అమ్మ రమణమ్మ. నాకో చెల్లి. మాది ధనిక కుటుంబం కాదు. అలాగని తినడానికీ, ఉండటానికీ ఇబ్బంది ఉండేది కాదు. ఒక్కడినే కొడుకును కావడంతో నన్ను గారాబంగానే పెంచారుగానీ, ఇష్టం వచ్చినట్లు ఖర్చు పెట్టుకోవడానికి డబ్బు ఉండేది కాదు.

నాటకాలంటే తగని మోజు

నేనెప్పుడూ వెనక బెంజీ స్టూడెంట్‌నే. చదువు పెద్దగా అబ్బలేదు. మార్కుల్లోనూ అదే తీరు. నాటకాలంటే మాత్రం తగని మోజు. స్టేజీ ఎక్కే విషయంలో ఎప్పుడూ ముందుండే వాడిని. సినిమా పత్రికలు, సినిమాల గురించి చర్చలే లోకంగా గడిపేవాడిని. టీచర్లు తిట్టినా పట్టించుకునేవాడిని కాదు. అప్పటికింకా సినిమాల్లోకి రావాలనే ఆలోచన రాలేదు.ఆ రోజుల్లో సినిమా చూడాలంటే నెల్లూరు వెళ్లాల్సిందే. మా స్వగ్రామం మైపాడు నుంచి నెల్లూరుకు సరిగ్గా 16 కిలోమీటర్లు. రోజూ అంత దూరం వెళ్లి సినిమా చూడటం కష్టం కనుక పదిహేను రోజులకు ఒకసారి సైకిల్‌ మీద ముగ్గురు మిత్రులం నెల్లూరు వెళ్లి సినిమా చూసేవాళ్లం.నాకు సొంత సైకిల్‌ లేదు. రెండుసార్లు సైకిల్‌ మీదనుంచి పడి, దెబ్బలు తగలడంతో మా అమ్మ భయపడి నాకు సైకిల్‌ కొనివ్వడానికి ఒప్పుకోలేదు. అందుకే మా ఫ్రెండ్‌ సైకిల్‌ మీద వెళ్లేవాళ్లం. అదీ కూడా లేకపోతే సైకిల్‌ అద్దెకు తీసుకుని వెళ్లేవాళ్లం. మా అమ్మని బతిమాలితే ఐదు రూపాయలిచ్చేది. జాగ్రత్తగా వెళ్లమని పదేపదే చెప్పేది.