అబ్బా.. కోట ఏం చేశాడ్రా అంటుంది లోకం.. ఐతే...

నవరసాలూ పండించేవాడే నటుడు. ఆ కోవలో తెలుగు తెరకు లభించిన గొప్ప వరం కోట శ్రీనివాసరావు. రౌద్రం, రాజకీయ కపటత్వం, ఆవేదన, హాస్యం, మధ్యతరగతి మందహాసం, మూర్తీభవించిన మానవత్వం, పెద్దరికం, పేథస్‌, నవరసాలూ పలికించే కంఠస్వరం...ఇలా తెరపై ఎన్ని వందల సజీవ పాత్రలో! మధ్యతరగతి వినోదంలో ఆయనే మూలపాత్రధారి!కోట పేరు వినగానే మన ఇంట్లో మనిషిలానే కని పిస్తారు. సమాజంలో నిత్యం ఎదురయ్యే మనిషి స్వభావాలకు తెరపై ప్రాణంపోసిన నటుడు.నిజమే... పేదింటి బాబాయ్‌, కరుడు గట్టిన మావయ్య, స్వచ్ఛమైన రాజకీయ నాయకుడు, మాయల మరాఠీ మాంత్రికుడు, పిసినిగొట్టు, నలుగురికీ ఆదర్శంగా నిలిచిన పెద్దమనిషి, ఆదరించే తాతయ్య, అందరికీ నచ్చిన ఇంటి పెద్ద...పాత్ర ఏదైనా ఇట్టే ఒదిగి పోయారు కోట.నలభైయేళ్ళ సినీ కెరీర్‌ని నల్లేరు మీద బండిలా నడిపించేశారు. ఇప్పటికీ అగ్ర దర్శకులు కాల్షీట్ల కోసం ఆయనకు ఫోన కాల్స్‌ చేస్తూనే ఉన్నారు. వ్యక్తి గత జీవితంలో ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా కెరీర్‌ బ్యాలన్స చేసుకుంటూ వెరైటీ పాత్రలు పోషిం చారాయన. ఒక్కమాటలో చెప్పాలంటే కోట శ్రీనివాసరావు జీవితమే ఒక ప్రతిఘటన. అందుకే అదే టైటిల్‌తో ఈ శీర్షిక నిర్వహించాలనిపించింది. ఆ విషయమే ఆయనతో చెప్పాం.

 

అదిగో, ఇదిగో అంటూ ఒకరోజు ఇంటికి ఆహ్వానించారు.అందమైన కళాకుటీరంఓ శుక్రవారం సాయంత్రం ఐదు గంటల సమయం.ఫిల్మ్‌నగర్‌లో కోట శ్రీనివాసరావు ఇల్లు.‘ఎవరు కావాలండీ’ గేటు ముందున్న వ్యక్తి పలకరింపు.ఫలానా అని చెప్పగానే లోపలికివెళ్ళి వెంటనే సందేశం తెచ్చాడు.‘సార్‌.. మిమ్మల్ని రమ్మన్నారండీ, రండి’ అంటూ వినయంగా లోపలికి దారి చూపించారో పెద్దాయన. గేటు లోపల అడుగుపెట్టగానే ఎడమ వైపు పువ్వుల కుండీలు ఆహ్వానం పలికాయి. రంగు రంగుల గులాబీ మొక్కలు, చామంతులు...ఎన్నో వెరైటీ గుబాళింపులు. ఆహ్లాదకర వాతావరణం.అక్కడినుంచి ముందు గదిలోకి ప్రవేశించాం. నిజంగా అదో కళానిలయమే! ఎడమ వైపు గోడమీద నిండైన పెద్ద పోస్టర్‌. రావణాసురుడు, మాంత్రికుడు, ‘అహనా పెళ్లంట’ పిసినారి, ‘రెండిళ్లపూజారి’లో లేడీ డాన్, రాక్షస రాజు... ఇలా పలు చిత్రాల్లో ఆయన ప్రాణం పోసిన భిన్న పాత్రల భంగిమలు. రెప్పవేయనీయ లేదు. అలాగే చూస్తూ ఉండిపోయా.‘నువ్వు నటించకపోవడమే పెద్ద నటన’ అని బాపు తన దగ్గరకొచ్చే నటీనటులతో అంటుండేవారట! అలా నటించకుండానే పాత్రల్లో సహజంగా జీవించిన నటుడు కోట శ్రీనివాసరావు. అబ్బో! కెరీర్‌లో ఎన్ని పాత్రలు చేశారో?!

 

ఆ ఫోటోలు చూస్తూ మనసులో అనుకున్నాను.‘సార్‌ వస్తున్నారు. పది నిమిషాలు కూర్చోండి’ గొంతు విని అటు చూస్తే ఇందాకటి పెద్దాయనే.సరేనన్నట్టు తలూపా. ఎదురుగా ఆయన జీవన సాఫల్యానికి ప్రతిబింబాలుగా నిలిచిన ఎన్నో పురస్కారాల షీల్డ్‌లు. చాలానే ఉన్నాయి.టీ తో పలకరింపు‘మీరేనా ఆంధ్రజ్యోతి నుంచి వచ్చింది. మీ గురించే మాట్లాడుకుంటున్నాం’ అంటూ బయటకు వచ్చారు కోట శంకర్రావు. చాలా చిత్రాల్లో, ఇటీవల సీరియల్స్‌లో నటిస్తున్నారీయన. కోట శ్రీనివాసరావుగారి తమ్ముడే.‘వస్తానన్నాయ్‌. నువ్వు వీళ్ళతో మాట్లాడు’ అని చెప్పి ‘వస్తానండీ’ అని సెలవు తీసుకున్నారు శంకర్రావుగారు.‘రండి. కూర్చోండి. ఇందాక మీరు ఫోన్ చేసి నప్పుడు మా శంకరం (కోట శంకర్రావు) పక్కనే ఉన్నాడు.’ అంటూ హాల్లోకి వచ్చి కూర్చున్నారు కోట శ్రీనివాసరావు.‘‘ఆంధ్రజ్యోతి నవ్య వీక్లీ వాళ్ళు సీరియల్‌ రాస్తానని అంటున్నార్రా.. నేనేమో ఇవాళా.. రేపూ అని సాగదీస్తున్నాను. ఏం చెప్పాలి? ఎలా చెప్పాలి? అని ఒకటే ఆలోచన. వాళ్ళకి ఏదీ తెగేసి చెప్పలేకపోతున్నా’ అని అతనితో చెప్పా. ‘వాళ్లంతట వాళ్లే రాస్తామంటే ఎందుకు ఆలోచిస్తావు. సుదీర్ఘమైన కెరీర్‌ ఉన్న వాడివి. నువ్వు చెప్తే బావుంటుందన్నాయ్‌. సీరియల్‌ మొదలుపెట్టు. రమ్మనమని చెప్పు’ అని శంకరం అన్నాడు.