విజయం ఎప్పుడూ ఒంటరిది కాదు.. విజయోత్సవాన్ని జరుపుకోవడానికి చుట్టూ వందమంది గుమిగూడతారని అంటారు. నిజానికి గుర్తించాల్సిన విషయం ఇక్కడ ఇంకోటి ఉంది. విజయమనే గమ్యాన్ని చేర్చే ప్రయాణం కూడా ఎప్పుడూ ఒంటరిది కాదు. దానికి కూడా చాలా అంశాలు ఊతాన్నిస్తాయి. సరైన లక్ష్యం, ఆ లక్ష్యాన్ని చేరుకోవాలనే తపన, అవిశ్రాంతమైన కృషి, అలుపెరగని ఓర్పు.. ఇలా పలు అంశాల తోడ్పాటుతోనే విజయం వరిస్తుంది. అంతటి గొప్ప విజయమే ‘వారాలబ్బాయి’ మురళీమోహన్‌తో ‘జయభేరి’ మోగించింది. ‘గెలుపులో బతుకు ఉండదు. బతికే విధానమే గెలుపును నిర్ణయిస్తుంది. నా జీవితంలో విజయం పంచిన తీపికన్నా దాన్ని చేరుకోవడానికి చేసిన ప్రయాణం చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది’ అంటారు మురళీమోహన్.
వ్యాపారవేత్తగా, నటుడిగా, బాధ్యతగల భర్తగా, ఆదరాభిమానాలున్న తండ్రిగా, రాజకీయ నాయకుడిగా ఆయన జీవితం పరిపూర్ణం.‘చేయాల్సిన పనులతో క్షణాలన్నీ బిజీగా మారిపోయాయనుకోండి. చెడు గురించి ఆలోచించే తీరికే ఉండదు.. ఏమంటారు..?’ అని శ్రోతని ప్రశ్నిస్తారాయన. అంతటి చాలకీతనం ఉండటం వల్లనేమో 77ఏళ్ల వయసులోనూ(2017 ఆగస్టు నెల నాటికి) హుషారుకే హుషారు పుట్టేలా ఉండగలుగుతున్నారు. నవతరంతో పోటీపడుతూ ముందుకు సాగిపోతునన్నారు. ఆయన జీవిత ప్రస్థానాన్ని ‘ఆంధ్రజ్యోతి-నవ్య వీక్లీ’లో ప్రచురిస్తే బాగుంటుందనిపించింది. ఆ విషయాన్నే ఎడిటర్ జగన్నాథశర్మగారి ముందు ఉంచితే ‘బాగుంటుంది.. చేయండి.. ఒకప్పుడు మధ్యతరగతి కుటుంబాలను ప్రతిబింబించే కథల్లో మురళీమోహన్ బాగా చేశారు. చాలా మంది మిడిల్ క్లాస్ వాళ్లకు ఆయన పాత్రలు ప్రతినిధులు. ‘వారాలబ్బాయి’ అప్పట్లో ఎంత పెద్ద హిట్టో... ‘ఓ వారాలబ్బాయి జయభేరి’ అనే టైటిల్ పెట్టి రాస్తే బాగుంటుంది. ఆయన పర్మిషన్ తీసుకోండి’ అని సూచించారు.
వెంటనే ఆరోజు మధ్యాహ్నం మురళీమోహన్ గారికి ఫోన్ చేశాం.‘మీ వృత్తి, ప్రవృత్తి,.. జీవితంలోని పదనిసలతో మా ‘ఆంధ్రజ్యోతి నవ్య వీక్లీ’లో ధారావాహిక రాయాలనుకుంటున్నామండీ’.. అని చెప్పాం.. ‘ఓ.. దానిదేముంది.. నాలుగు రోజులు కాసింత బిజీగా ఉంటాను.. ఆ తర్వాత కలుద్దాం.. వద్దురుగానీ..’ అన్నారు.. అన్నట్టుగానే నాలుగు రోజుల తర్వాత ఫోన్ చేశాం.. ‘ఈరోజు వస్తారా.. కాస్త హెక్టిక్‌గా ఉంది.. ఇంకో గంటలో ఎక్కడికి రావాలో చెబుతాను.. వచ్చేయండి..’ అని అన్నారు. మరళా ఫోన్ చేసి ‘ఉదయం 11గంటలకు ఫిల్మ్ చాంబర్ ఆవరణలోని ‘మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్’ కార్యాలయానికి వస్తాను.. అక్కడో ముఖ్యమైన పని ఉంది.. పూర్తవగానే మనం కూర్చుందాం..’ అన్నారు. అక్కడికి వెళ్లాం..హడావిడిగా మెట్లు దిగుతూ కనిపించారు మురళీమోహన్.. ఆయనతోపాటు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడు శివాజీ రాజా, సభ్యుడు సురేష్ కొండేటి మరికొందరు ఉన్నారు.. ‘ఏంటండీ.. ఎలా ఉన్నారు..?’ అని శివాజీ రాజా పలకరించారు. ‘మీరు వచ్చేశారా.. మీరు ఏమీ అనుకోకపోతే, మేం.. కె.విశ్వనాథ్ గారి ఇంటికి వెళ్తున్నాం. త్వరగా వచ్చేస్తం.. మాట్లాడుదాం.. పది నిమిషాలు ఉండగలరా..? ఫర్వాలేదుగా..’ అన్నారు మురళీమోహన్..