హీరోగా మొదటి సినిమా ఫ్లాప్ కావడంతో డిజప్పాయింటయ్యా..

సక్సెస్‌ఫుల్‌ న్యూస్‌ రీడర్‌గా ఎదిగి ఎంతో పాపులర్‌ అయ్యా

కథను ‘రేసుగుర్రం’ లా పరుగెత్తించి ‍ ప్రేక్షకులతో ఔరా అనిపించుకున్న సినీ రచయిత వక్కతం వంశీ. ‘కిక్‌’ ఇచ్చే సినిమాలతో టాలీవుడ్‌ కథా రచనను సరికొత్త పుంతలు తొక్కిస్తున్నారాయన .టీవీ యాంకర్‌గా కెరీర్‌ ప్రారంభించి నటుడుగా, బ్లాక్‌బస్టర్‌ చిత్రాల రచయితగా ఎదిగారు. తాజాగా దర్శకత్వ శాఖలో ప్రవేశించారు .ఆయన ‘టెంపర్‌’ చిత్ర కథ హాలీవుడ్‌ స్థాయి నవలగా అంతర్జాతీయ మార్కెట్‌లోకి ప్రవేశించడానికి రంగం సిద్ధం చేసుకుని, వెండి తెరను సంభ్రమాశ్చర్యాలకు గురిచేస్తోంది. ‘ప్రేక్షకుణ్ణి మాయ చేయాలిగానీ, మోసం చెయ్యకూడదు’ అంటున్న వక్కంతం వంశీ ఇంటర్వ్యూ మీ కోసం.....

చిత్తూరు జిల్లా పుంగనూరు సమీపంలోని అరికెల మా సొంత ఊరు. 1975లో నేను అక్కడే జన్మించాను.మా నాన్నగారు వక్కంతం సూర్యనారాయణరావ్‌. అమ్మ స్వర్ణకుమారి. మేం ముగ్గురు సంతానం. ఇంట్లో పెద్ద కొడుకుని. పెద్ద తమ్ముడు ప్రభంజన్‌కుమార్‌ అమెరికాలో సాఫ్ట్‌వేర్‌ ఇంజనీరు. రెండో తమ్ముడు చైతన్య ప్రసాద్‌ నా దగ్గరే స్ర్కిప్టు రచయితగా సహయం అందిస్తున్నాడు. నాన్నగారు ప్రముఖ రచయిత. ఆయన టి.టి.డి.లో అనువాదకుడు కావడంతో నా బాల్యం, చదువు అంతా తిరుపతిలోనే గడిచింది.

నేనో స్పాయిల్‌ కిడ్‌ని

బాల్యం నుండీ సినిమాలంటే నాకెంతో మక్కువ. చివరకు అదే నా జీవిత సర్వస్వమైపోయింది. సినిమా పట్ల నాకున్న ప్రేమ నన్నొక స్పాయిల్‌ కిడ్‌గా మార్చేసింది. వచ్చిన ప్రతి సినిమా చూసేవాణ్ణి. ఆ ధ్యాసతో స్కూలు ఎగ్గొట్టేవాణ్ణి. అమ్మానాన్న భయపడి ఎనిమిదో తరగతిలో పాకాల సమీపంలోని రామతీర్థ సేవాశ్రమం స్కూల్లో చేర్పించారు. కానీ ఆశ్రమానికి వెళ్ళకుండా రోజుల తరబడి ఆ డబ్బులతో చూసిని సినిమా మళ్ళీ మళ్ళీ చూస్తూ బంధువుల ఇళ్ళకు తిరుగుతూ ఎప్పటికో స్కూలుకు చేరుకునేవాణ్ణి. దాంతో నాన్న నా తీరును అర్థం చేసుకుని బాగా చదివి పరీక్షలు బాగా రాస్తే సినిమాలకు పంపిస్తాననేవారు. అలాగే శ్రద్ధగా చదివి నాన్ననడిగి సినిమాలకు వెళ్ళేవాణ్ణి. మా కజిన్స్‌ అందర్నీ కూర్చోబెట్టి సినిమా కథను ఎంతో అందంగా వర్ణించి చెప్పేవాణ్ణి. కథలు బాగా చెబుతాడని అందరూ మెచ్చుకునేవారు.చదివి ఏదో సాధించాలనే కోరిక ఉండేదికాదు నాకు. పైగా నాన్న ఎలాంటి ఆంక్షలు విధించేవారు కాదు. ‘నీలో ఉండే మెరిట్‌, టేలంట్‌ పెంపొందించుకో’ అనేవారు. సినిమా ఇచ్చే హ్యాపీనెస్‌ మరేదీ ఇచ్చేదికాదు. ఎలాగో బి.ఏ డిగ్రీ పూర్తిచేశాను. నాటకాల్లో నటించేవాణ్ణి. సినిమాల్లో చేరి నటుడుగా ఎదగాలనే కోరిక నాలో బలపడిపోయింది. అలా ఇంటర్మీడియట్‌ ఫస్టియర్లో ఉండగానే నాన్న నా అభిరుచిని అర్థం చేసుకున్నారు.చిన్నప్పటినుంచీ పుస్తకాలు చదివేవాణ్ణి. టెంపోరావు నవలలంటే ఎంతో ఇష్టం. డిటెక్టివ్‌లు, క్రైమ్‌ స్టోరీలు, వారపత్రికలు, సినిమా పత్రికలు విపరీతంగా చదివేవాణ్ణి. దాంతో నాన్నగారే మంచి పుస్తకాలు సెలక్ట్‌చేసి చదవమని ఇచ్చేవారు. అలా జేమ్స్‌హేడ్లీ ఛేజ్‌, షిడ్నీ షెల్డన్‌ బుక్స్‌ చదివేవాణ్ణి. కొంచెం పెద్దయ్యాక నాన్నగారి రచనలు చదవడం ప్రారంభించాను. ఆయన డిక్టేట్‌ చేస్తుంటే రాసేవాణ్ణి. అలా నాకు తెలియకుండానే కథా రచనపై నాలో ఆసక్తి జీర్ణించుకుపోయింది.