పూర్వం పాటలీపుత్రంలో యజ్ఞసోముడు, కీర్తి సోముడు అని ఇద్దరు అన్నదమ్ములు ఉండేవారు. పెద్దలు సంపాదించి పెట్టిన ఆస్తిని ఇద్దరూ సమానంగా పంచుకున్నారు. యజ్ఞసోముడు తన వాటానంతా ఖర్చు చేసుకుని నిరుపేదయితే కీర్తిసోముడు తన వాటా సొమ్మును పెట్టుబడిగా పెట్టి వ్యాపారం చేసుకుని వృద్ధిలోకి వచ్చాడు. పేదరికాన్ని అనుభవిస్తూ బంధువుల మధ్య ఉండలేక యజ్ఞసోముడు వేరే వూరికి వెళ్ళిపోయే ప్రయత్నాల్లో పడ్డాడు. ప్రయాణానికి భార్యనుసిద్ధంకా అన్నాడు.‘‘చేతిలో చిల్లిగవ్వ లేకుండా ప్రయాణం ఏమిటండీ’’ అడిగింది భార్య.‘‘కష్టమే! కాని తప్పదు! ఈ వూరిలో ఉండలేను’’ అన్నాడు యజ్ఞసోముడు.‘‘మీ తమ్ముడు కీర్తిసోముణ్ణి అడిగి చూడండి! ఓ నాలుగు వరహాలిచ్చినా దారి ఖర్చులకు ఉంటాయి’’ అంది భార్య. సరేనని తమ్ముణ్ణి కలిశాడు యజ్ఞసోముడు. దారి ఖర్చులడిగాడు.‘‘ఇస్తానుండు’’ అని కీర్తిసోముడు వరహాల మూట విప్పుతున్నాడో లేదో అంతలో అతని భార్య అక్కడికి విసురుగా వచ్చింది.‘‘ఎవరెక్కడికో పోతూ దారి ఖర్చులు మనల్ని అడిగితే ఎలాగండీ? మన దగ్గరేమయినా డబ్బు మూలుగుతోందా? అడగడానికి సిగ్గుండాలి. ఆగండి’’ భర్తను అడ్డుకుందామె.
అన్న మీద అభిమానం ఉన్నా ఏమీ చేయలేని స్థితి. కీర్తిసోముడు తప్పు చేసిన వాడిలా తలదించుకున్నాడు. తమ్ముడిక సాయం చేయలేడనుకుని, వెనుతిరిగాడు యజ్ఞసోముడు. జరిగిందంతా భార్యకు చెప్పి విలపించాడు.‘‘బాధపడకండి! దేవుడు ఎలా నిర్ణయిస్తే అలా జరుగుతుంది. పదండి’’ అంది భార్య. యజ్ఞసోముడితో అడవులలో ప్రయాణించసాగింది.కొద్దిరోజులు గడిచాయి. ఒకనాడు అడవిలో వారు నడుస్తుండగా కొండచిలువ ఒకటి జరజరమంటూ వచ్చి యజ్ఞసోముణ్ణి అమాంతం మింగేసింది. అది చూసి భార్య భోరు భోరున విలపించసాగింది.‘‘ఎందుకు ఏడుస్తున్నావు’’ అడిగింది కొండచిలువ.‘‘నా భిక్షాపాత్రను మింగేశావు నువ్వు. అతన్ని చూపించి పదిళ్ళ ముందు బిచ్చమెత్తుకుందామను కున్నాను. చేతిలో పాత్ర లేకుండా చేశావు’’ అన్నదామె.‘‘నీకు కావాల్సింది భిక్షాపాత్రే కదా! నేనిస్తానుండు’’ అని బంగారు భిక్షాపాత్రను కక్కిందా కొండచిలువ.‘‘తీసుకో’’ అంది. అందుకుందామె. మెరిసి పోతున్న పాత్రను తిప్పి తిప్పి చూసి ఇలా అంది.‘‘ఆడదాన్ని. పైగా ఒంటరిదాన్ని. చేతిలో ఉన్నదేమో బంగారు పాత్ర. భిక్ష వేస్తారంటావా నాకు’’