అనగనగా రత్నపురం. ఆ పురంలో శివుడు-మాధవుడు అని ఇద్దరు జూదగాళ్ళు. వారిద్దరూ మోసానికి పెట్టింది పేరు. అనేకమంది మోసగాళ్ళను చేరదీసి వారు ఆ ఊరిలోని ధనవంతుల్ని బాగా దోచుకున్నారు. దోచేందుకు ఇక ఆ ఊరిలో ఏదీ లేద ని, ఎవరూ లేరని తెలుసుకుని ఓ రోజు ఇలా తర్జన భర్జనలు పడ్డారు.‘‘ఇక ఇక్కడ ఉండడం అనవసరం. వేరే ఏదేని ఊరు చూసుకోవాలి. అక్కడకెళ్ళి దోచుకోవాలి’’‘‘అయితే ఉజ్జయినికి పోదాం. అక్కడ శంకరస్వామి అని బాగా డబ్బున్న వాడున్నాడు. రాజపురోహితుడతను. వాడి సొమ్ము కాజేద్దాం’’‘‘అవునవును! నేనూ విన్నాను. బాగా పిసినిగొట్టట! రాజుగారిచ్చే దక్షిణలలో సగ భాగం అతనికి ఇవ్వాలట! లేకపోతే గొడవంటున్నారు. డబ్బునంతా ఏడు భోషాణాల్లో దాచి నేలలో పాతిపెట్టాట్ట’’
‘‘ఆ డబ్బుతో పాటు అందమైన కూతురు కూడా ఉందటతనికి. చాకచక్యంగా ప్రవర్తిస్తే ఆ కూతుర్ని కూడా దోచుకోవచ్చు’’‘‘ఆలస్యం అమృతం విషం. పద’’బయల్దేరారిద్దరూ. ఉజ్జయినికి చేరుకున్నారు. ముందు మాధవుడు రాకుమారుని వేషం వేసుకుని పరివారంతో ఊరి బయట శిబిరాలు ఏర్పాటు చేసుకుని విడిది చేశాడు. తర్వాత శివుడు బ్రాహ్మణ బ్రహ్మచారిలా వేషం వేసుకుని నగర ప్రవేశం చేశాడు. సిప్రా నదీ తీరాన ఓ మఠంలో విడిది చేశాడు. అందరూ అతనిని గమనించేట్టుగా బంకమన్ను, దర్భలు, భిక్షా పాత్ర, జింక చర్మాన్ని దగ్గర ఉంచుకున్నాడు.తెల్లారుతూనే శరీరానికి దట్టంగా మన్ను పూసుకునేవాడు శివుడు. సూర్యకాంతిలో కాసేపుండి, తర్వాత నదిలో స్నానం చేసేవాడు. స్నానాంతరం శీర్షాసనం వేసేవాడు. శీర్షాసనంలో చాలాసేపు గడిపేవాడు. ఆ తర్వాత ఆలయానికి చేరుకునేవాడు. శివుని ఎదుట పద్మాసనంలో కూర్చుని దర్భలు ధరించి జపం చేసేవాడు. మధ్యాహ్నం అయితే కృష్ణాజినం ధరించి భిక్షాటన చేసేవాడు. భిక్షను బ్రాహ్మణుల దగ్గర్నుంచే అర్థించేవాడు. మూడు భిక్షలు చాలునతనికి. వాటిని తీసుకుని వచ్చి మూడు భాగాలు చేసేవాడు. ఒక భాగాన్ని కాకులకు వేసి, మరో భాగాన్ని ఆశ్రయించిన అన్నార్తునికి ఇచ్చి మిగిలిన భాగంతో తన కడుపు నింపుకునేవాడు. సూర్యాస్తమయం వరకు మళ్ళీ జపమాచరించేవాడు. రాత్రి మౌన వ్రతం చేపట్టి కళ్ళు మూసుకునేవాడు. అతని దొంగజపాన్ని నిజమనుకుని శివుణ్ణంతా అభిమానించి ఆరాధించసాగారు. అతని కీర్తి ఉజ్జయిని నగరమంతటా వ్యాపించింది.