అర్ధరాత్రి కావొస్తోంది... మద్రాసు న్యూవింగ్టన్‌ హైస్కూలు భవనం పై అంతస్తు పడగ్గది. చీకట్లో, రెండు పడకల మీద గాఢనిద్రలో వున్నారు వాళ్ళిద్దరూ. హఠాత్తుగా గోడ గడియారం గంటలు కొట్టసాగింది. పన్నెండు గంటలు కొట్టడంతో తేదీ మారి, అక్టోబర్‌ 15, 1919 రాత్రి ... గంటలు పూర్తవగానే పెద్ద చప్పుడుతో ఢామ్మని పేలుడు! కెవ్వున కేక! గబగబా స్కూలు విద్యార్థులు దౌడు తీస్తున్న అడుగుల చప్పుళ్ళు...

********************** 

సివిల్‌ సర్జన్‌ మేజర్‌ హింగ్స్‌టన్‌ కాల్‌ అందుకుని వచ్చి చూస్తున్నాడు. తల కుడిపక్క తుపాకీ గుండు దెబ్బకి శవమై పడున్నాడు హైస్కూల్‌ ప్రిన్సిపాల్‌ డేలా హై. గుండెలవిసేలా రోదిస్తోంది మిసెస్‌ హై.ఉదయం స్కూలు భవనం మెట్ల పక్కన 12 బోర్‌ గన్‌, దాని చుట్టూ కొన్ని తూటాలూ కన్పించాయి. పోలీసులు దర్యాప్తు తీవ్రతరం చేశారు. విద్యార్థులు కడంబూర్‌, సింగంపట్టి పోలీసుల ఎదుట వున్నారు.‘యేసెయ్యాలన్నాడ్సార్‌, దొరైని ఈ కడంబూరే!’ విద్యార్థులు చెప్పేస్తున్నారు.‘ఎందుకూ...’‘మా తమిళుల్ని బార్బేరియన్స్‌ అన్నాడ్సార్‌ దొరై - అందుకని!’‘బార్బేరియన్స్‌ అన్నాడని కోపంతో అలా మాట్లాడానే గానీ నేనేసెయ్యలేద్సార్‌!’ మొత్తుకోసాగాడు కడంబూర్‌. జమీందారు కొడుకు సింగంపట్టి తనకేం కాదని ధైర్యంగా వున్నాడు. ‘వీళ్ళే చంపేశార్సార్‌ దొరైనీ!’ తోటి విద్యార్థులు చెప్పేస్తూంటే, సింగంపట్టి ప్లేటు ఫిరాయించి అప్రూవర్‌గా మారిపోయాడు.

కడంబూరే చంపాడని వాంగ్మూలమిచ్చేశాడు. కడంబూర్‌ని అరెస్టు చేశారు.ఫ ఫ ఫనగరంలో భావోద్వేగాలు చెలరేగాయి. రకరకాల పుకార్లూ వాదోపవాదాలూ తెల్ల దొర హత్య చుట్టూ ముసురుకున్నాయి. పరిస్థితిని గమనించి మద్రాసు గవర్నర్‌ లార్డ్‌ విల్లింగ్డన్‌ భారత ప్రభుత్వానికి లేఖ రాశాడు. కేసుని మద్రాసులో విచారిస్తే ... ఈ ఉద్రిక్త పరిస్థితుల నడుమ నిందితుడు కడంబూర్‌కి న్యాయం జరగదనీ, జ్యూరీ ప్రభావితమయ్యే అవకాశముందనీ, అందువల్ల నిష్పాక్షిక విచారణ జరగాలంటే కేసుని దూరంగా బాంబే హైకోర్టుకి తరలించాలనీ విజ్ఞప్తి చేశాడు.బాంబే హై కోర్టులో స్వయంగా విచారణ చేపట్టిన చీఫ్‌ జస్టిస్‌ సర్‌ నార్మన్‌ మెక్‌లాయిడ్‌, ఆ రోజు విచిత్ర వేషధారణలో కోర్టు కొచ్చాడు. మొహమంతా కప్పేసినట్టున్న విగ్గు, ఎర్రటి చెమ్కీ గౌను, మోకాళ్ళ పట్టీలు, సిల్కు సాక్స్‌, భారీ బూట్లు ధరించి వచ్చాడు.