ఇరుకు గుడిసెలో కూర్చుని అసహ్యంగా చూస్తూ, పది లక్షలిస్తాను మంచి ఇల్లు కట్టుకోమన్నాడు. అడ్డంగా తలూపేశాడు శంకర్‌, ‘‘కట్టుకోవడం నాక్కూడా వస్తుంది లెండి’’ అంటూ. బాగా ఆలోచించుకుని చెప్పమన్నాడా వ్యక్తి. శంకర్‌ నవ్వి, ‘‘నీటికి రేటు కడతారా?’’ అన్నాడు. అర్ధంగాక, ‘‘నీళ్ళేమిటి?’’ అన్నాడతను. అది కౌసల్య చెప్తుందన్నాడు శంకర్‌.

ఆ వ్యక్తి రెచ్చిపోయి, ‘‘ఒరేయ్‌ నీటికీ, నీ నోటికీ, అన్నిటికీ రేటుంటుంది!! నోర్మూసుకుని ఒప్పుకో, పదిహేను లక్షలు!’’ అని అరిచాడు. శంకర్‌ సున్నితంగా సారీ చెప్పాడు. కోపంగా లేచి, ‘‘ఇక నీ రెండు కలలూ నిజంకావు... కానివ్వను!!’’ అని హెచ్చరించి, గుడిసె తలుపుని ఓ తాపుతన్ని వెళ్లిపోయాడు.తమిళనాడులోని కుమారలింగం గ్రామం. పక్క వూళ్ళో సేల్స్‌గర్ల్‌గా పనిచేస్తున్న కౌసల్య డ్యూటీ ముగించుకుని గుడిసెకొచ్చింది. జరిగింది ఆమెకి చెప్పలేదు శంకర్‌. రేపు కాలేజీ ఫంక్షన్‌ ఉందన్నాడు. ఉదయం తొమ్మిది గంటలకి బస్సెక్కి దగ్గరి టౌనుకెళ్ళారు. కాలేజీ ఫంక్షన్‌కి కొత్త షర్టు కొనిస్తానని చెప్పింది కౌసల్య. ఆకుపచ్చ షర్టు కొన్నాక, ఆకలేస్తోందని చూస్తే, అరవై రూపాయలే ఉన్నాయి. అవి ఖర్చు పెట్టవద్దన్నాడు శంకర్‌. తిరిగి వెళ్లడానికి ప్రయాణమవుతూ, బస్టాండు రోడ్డు దాటుతున్నారు. సీసీ కెమెరా చూస్తూనే వుంది. ఒకడొచ్చి, ‘‘ఎందుకురా ప్రేమించావ్‌?’’ అన్నాడు క్రూరంగా చూస్తూ. తేరుకునేలోగా మరో నలుగురు బైక్స్‌ మీద వచ్చారు. పట్టపగలు... ‘‘ఎందుకురా ప్రేమించావ్‌?’’ అని మళ్లీ భీకరంగా అరుస్తూ, పొడవాటి కత్తులతో కసాకసా నరకసాగారు ఇద్దర్నీ. ఆ మృత్యుహేలను సీసీ కెమెరా పట్టేసుకుంటోంది క్షణ క్షణం... 36 క్షణాల్లో అంతా ముగిసిపోయింది...

************* 

‘‘రెండే కలలు నావి - ఒకటి ఈ గుడిసెను కూల్చి మా వాళ్ల కోసం ఓ ఇల్లు కట్టాలి, రెండోది నిన్ను జీవితాంతం ప్రేమగా చూసుకోవాలి’’ శంకర్‌ అంటూంటే కౌసల్యకి గుండెల్లోంచి ప్రేమంతా పెల్లుబికింది... ప్రేమ పారే నీరంత సహజమైనదని ఆమె నమ్మకం. అందులో ఎవరైనా పడవచ్చు, జలకాలాడొచ్చు.

కానీ ఇంట్లో, కాలేజీలో, వూళ్ళో అంతటా ఆంక్షలే ఆమెకి! ఎయిర్‌ హోస్టెస్‌ అవుతానంటే, కురచ డ్రెస్సు లేసుకుంటావ్‌ వద్దని, ప్రైవేట్‌ కాలేజీలో కంప్యూటర్‌ కోర్సులో చేర్పించారు. అక్కడ అమ్మాయిలు అబ్బాయిలు ఒకరినొకరు చూసుకోకూడదు, మాట్లాడుకోకూడదు, వేర్వేరు క్లాసులు. ఏ అమ్మాయైునా, అబ్బాయితో కన్పించిందా, సెక్యూరిటీ వాళ్ళు మేనేజ్‌మెంట్‌కి చెప్పేస్తారు. మేనేజ్‌మెంట్‌, పేరెంట్స్‌కి చెబుతుంది. ఆ పేరెంట్స్‌ పిల్లలను బాదుతారు. బస్సులో కండక్టర్‌ చూశాడా, ఇల్లు వెతుక్కుంటూ వచ్చి మరీ తల్లిదండ్రులకి చెప్పేస్తాడు. ఇటు కాలేజీలో, అటు సొంత వూరు పళనిలో, అందరి కళ్ళూ అమ్మాయిల మీదే. అందరివీ నిఘా కళ్ళే. ఒక రోజు కండక్టర్‌ కౌసల్య ఇంట్లో చెప్పనే చెప్పేశాడు, శంకర్‌ అనే విద్యార్థిని రహస్యంగా ప్రేమిస్తోందని!