చీకట్లు ముసురుకుంటూంటే, వీధిలో ఉండుండి ఒక్కో కారు రివ్వు మని దూసుకొస్తోంది ఇద్దరమ్మాయిలు పరుగెత్తుకుని వెళ్లి దాక్కుంటున్నారు. మళ్ళీ వీధిలోకొచ్చి చూస్తున్నారు. మళ్ళీ కారొస్తూంటే, హెడ్ లైట్స్ మీద పడకుండా, కేరింతలతో వెళ్లి దాక్కుంటున్నారు...
‘బావుంది మీ ఆట!’ అన్నాడతను ఎక్కడ్నించో వచ్చి. ఎగాదిగా చూశారతణ్ణి. ‘నా పేరు జానీ. నాకు 24, పెళ్లి కాలేదు. మీకు బొమ్మలు కావాలా?’ అన్నాడు. ‘మా యింట్లో బొమ్మ వుంది!’ అని పరుగెత్తింది కేథరిన్. ఆమె బొమ్మతో వచ్చి చూస్తే మరియా లేదు, జానీ లేడు...ఫఫఫ‘14 ఏళ్లుగా కేసే తీసుకోరేంటి? మీరేం పోలీసులు?’ విసిగిపోయి అనేసింది జానెట్.‘జానీగారెవరో తెల్సా? ఏర్‌ఫోర్స్‌లో, ఆర్మీలో కెప్టెన్ ర్యాంకుకి ఎదిగిన యుద్ధ వీరుడు. వియత్నాం యుద్ధంలో చూపిన ధైర్యసాహసాలకి కాంస్య పతకం పొందాడు. తర్వాత పోలీస్ డిపార్ట్‌మెంట్‌లోనూ ఆఫీసర్‌గా పని చేశాడు...’‘ఐతే ఏంటి సర్, ఘోరం చేశాక?’ అనేసి విరక్తిగా వెళ్ళిపోయి, ఇక నేరుగా ఇలినాయిస్ ేస్టట్ పోలీస్‌కి మెయిల్ కొట్టింది. ఆనాటి నేరంలో జానీ ఇచ్చిన ఎలిబీని పునర్విచారణ చేయాల్సిందేనని పట్టు బట్టింది.
పద్నాల్గేళ్ళుగా స్థానిక సికమోర్ పోలీసుల దగ్గర్నుంచీ ఎఫ్‌బీఐ వరకూ ఆమె చెయ్యని ప్రయత్నం లేదు. ఇక ఈమెని తప్పించుకోలేమని, ఇలినాయిస్ పోలీసులు కేసు రీఓపెన్ చేశారు.సుదీర్ఘ చరిత్రగల లోతైన కేసు. ఈ కాలగమనంలో సాక్షులు ఎవరున్నారో ఎవరు పోయారో తెలీదు. కానీ ఆనాడు జానీ ఇచ్చిన సాక్ష్యం, ఎలిబీ - ఆ రోజు మధ్యాహ్నమే తను ఫిజికల్ టెస్టులో పాల్గొనేందుకు ట్రైన్ ఎక్కి ఏర్ ఫోర్స్ క్యాంపుకి వెళ్లిపోయాడనీ...ఎక్కడో వంద మైళ్ళ దూరంలో, దొరికిన ఏడేళ్ళ మరియా మృతదేహంతో తనకే సంబంధం లేదనీ...తను చిన్న పిల్లల్ని రేప్ చేసి చంపేేస రకం కానే కాదనీ... ‘వీపు మీద నన్ను ఎక్కించుకుని ఒకటే తిప్పాడు.
దింపమన్నా దింపలేదు. బొమ్మలిస్తానన్నాడు. మా డాడ్ వచ్చి కోప్పడితే గానీ దింపేసి వెళ్ళిపోలేదు...’ చిన్నప్పటి సంఘటన చెప్పుకొచ్చిందావిడ. ఆనాటి జానీ ఫోటో కోసం పోలీసులు స్కూలు కెళ్తే, వాణ్ణి బహిష్కరించామనీ, ఫోటో లేదనీ చెప్పారు స్కూలు అధికారులు. పోలీసులు నాటి జానీ గర్ల్ ఫ్రెండ్స్ వేటలో పడ్డారు. కేథీ అనే ఒకే ఒక్క గర్ల్ ఫ్రెండ్‌ని కష్టపడి పట్టుకున్నారు.