‘‘అసిస్టెంట్ రాము ఏడి?’’గదిలోకి అడుగు పెడుతూ సెక్రటరీ సుధను అడిగాడు డిటెక్టివ్ శరత్.శరత్‌వైపు ఆశ్చర్యంగా చూసింది సుధ.‘‘అలా అడుగుతారేమిటి? మీరే కదా రాముని ఫోనుచేసి రమ్మన్నది?’’ అంది సుధ ఆశ్చర్యంగా.‘‘నేను పిలవటమేటి?’’ విస్తుపోతూ అడిగాడు.‘‘మీ దగ్గర నుంచి ఫోను వచ్చింది. అర్జంటుగా రమ్మన్నారని చెప్పివెళ్ళాడు’’.
‘‘ఏదీ ఓ సారి ఫోన్ చెయ్’’ అన్నాడు శరత్.సుధ ఫోను కలిపితే, ‘ఔటాఫ్ కవరేజ్ ఏరియా?’ అని వస్తోంది.శరత్ ఏదో అనబోయేంతలో, నంబర్ డిస్‌ప్లే లేకుండా ఫోన్ కాల్ వచ్చింది.‘‘హలో’’ అన్నాడు శరత్.అవతలి వైపు నవ్వు వినిపించింది.ఆ తరువాత అతడి మాటలు విని శరత్ ఆశ్చర్యపోయాడు. అచ్చు తను మాట్లాడుతున్నట్టే ఉంది.‘‘డియర్ డిటెక్టివ్ శరత్. నీ వల్ల జైలు పాలయ్యాను. నా కెరీర్ నాశనమైపోయింది. నా గర్ల్‌ఫ్రెండ్ జీవితం నాశనమైపోయింది. నిన్ను వదలను. నీ రాము ఇప్పుడు నా బందీ.ఇరవై నాలుగు గంటల్లోగా నువ్వు నీ రామూని రక్షించుకోగలిగితే రక్షించుకో. లేకపోతే, నీ అసిస్టెంట్ ఖతం.
నీ సెక్రటరీ కిడ్నాప్....’’ ఫోను కట్ అయింది.‘‘ఏమైంది బాస్?’’ సుధ కంగారుగా అడిగింది.‘‘ఫోన్ ఎన్ని గంటలకు వచ్చింది?’’ అడిగాడు శరత్.సుధ లెక్కలు కట్టింది.‘‘బాస్... ఫోను వచ్చి దాదాపుగా మూడుగంటలై ఉంటుంది’’ అని చెప్పింది.ఆలోచిస్తూ ఇన్‌స్పెక్టర్ విజయ్‌కి ఫోను చేశాడు శరత్.ఫోన్ ఎత్తి శరత్ మాట్లాడేలోగా అన్నాడు విజయ్.‘‘నువ్వు అసలు శరత్‌వి కావని నాకు తెలుసు. నువ్వు నన్ను మోసం చెయ్యలేవు. ఇంకోసారి ఫోన్ చేశావంటే జైల్లో తోస్తాను’’ అని ఫోను పెట్టేశాడు విజయ్.ఆలోచిస్తూ సుధ వైపు చూశాడు శరత్.‘‘ఓసారి విజయ్ నెంబరు కలుపు’’ అన్నాడు.సుధ విజయ్‌కి ఫోన్ చేసి ‘‘డిటెక్టివ్ శరత్ మాట్లాడతారు’’ అని శరత్‌కి అందించింది.