నా చెల్లెలు మూడు రోజుల నుంచీ కనిపించడం లేదు. భర్త పోయినప్పటినుంచీ డ్రిపెస్డ్‌గా ఉంటోంది. ఈ మధ్యనే ఉద్యోగంలో చేరింది. అక్కడ ఎవరితోనో సన్నిహితంగా ఉంటోంది. కానీ ఆఫీసులో అడిగితే ఆ పేరు గలవాళ్ళెవరూ లేరని చెబుతున్నారు. నాకు అయోమయంగా ఉంది. దయచేసి నా చెల్లెలు జాడ తెలుసుకోండి అని డిటెక్టివ్‌ శరత్‌ని అడిగాడు ఆ వచ్చిన వ్యక్తి. ఆఫీసులో ఆమెను ఎవరైనా మోసం చేసి చంపేశారా? అసలు ఏం జరిగింది?

–––––––––––––––––––––––

‘‘స్రవంతి మీకు ఏమవుతుంది?’’ అడిగాడు డిటెక్టివ్‌ శరత్‌.‘‘నా చెల్లెలు’’ అన్నాడు భరత్‌.‘‘మిస్సింగ్‌ రిపోర్ట్‌ ఇచ్చి ఎన్ని రోజులైంది?’’‘‘మూడు రోజులైంది. మా బంధువులంతా మిమ్మల్నే కలవమన్నారు’’ అన్నాడు.‘‘మీ వాళ్లందరి ఇళ్ళూ వెతికారా?’’‘‘వెతికాం. ఎక్కడా లేదు. ఐదేళ్ళక్రితం ఆమె భర్తపోయారు. అప్పటినుంచి డ్రిపెస్డ్‌గా ఉంటోంది. ఏదైనా ఉద్యోగం చేస్తే కాలక్షేపంగా ఉంటుందని ఎన్నోసార్లు చెప్పాను. ఎట్టకేలకు ఏడాదిక్రితం ఒక ఉద్యోగంలో చేరింది. అక్కడ సుధీర్‌ అనే వ్యక్తితో సన్నిహితంగా ఉంటోందని విన్నాను. నేను అతడిని ఎప్పుడూ చూడలేదు. కలవలేదు. ఐతే, అలా చెయ్యవద్దని నేను హెచ్చరించాక, చాలా ముభావంగా ఉంటోంది. మూడు రోజుల నుంచి కనిపించటం లేదు’’ జరిగింది చెప్పాడు భరత్‌.‘‘మీరు ఎప్పుడు హెచ్చరించారు?’’

‘‘నాలుగు రోజుల క్రితం. మేము ఊరు వెళ్లేముందు ఆమెను హెచ్చరించాను. రెండు రోజుల క్రితం ఊరు నుంచి తిరిగి వచ్చాను. అప్పటినుంచీ కనబడటం లేదు’’.శరత్‌ అతడి వైపు పరిశీలనగా చూశాడు.‘‘మూడురోజులక్రితం మిస్సింగ్‌ రిపోర్టిచ్చానన్నారు. మరి ఊరునుంచి వచ్చి రెండురోజులే అయిందంటున్నారు? ఇదెలాసాధ్యం?’’ అడిగాడు శరత్.నిట్టూర్చాడు శరత్‌.‘‘నేను ఊరు వెళ్తూ చెల్లెలు బాగోగులు చూడమని పక్కింటాయనకు చెప్పాను. ఆయన ప్రొద్దున్నే ఫోనుచేసి చెప్పాడు. ఇంట్లోంచి శబ్దం రావటం లేదు. పిలిస్తే ఎవ్వరూ సమాధానం ఇవ్వటం లేదని. ఇంటి తలుపులు దగ్గరకువేసి ఉంటే, ఆయన లోపలికి వెళ్లి చూశాడు. ఇంట్లో ఎవరూ లేరు. అదే చెప్పాడు నాతో. సెల్‌కి ఫోనుచేస్తే స్విచాఫ్‌ అని వస్తోంది. మనుగడలో లేదనివస్తోంది. దాంతో ముందు పోలీసు రిపోర్టివ్వమన్నాను. తరువాతరోజుకి నేనువచ్చేశా. పోలీసులు ఏమీ తేల్చలేకపోయారు. ఇంతవరకూ స్రవంతి జాడలేదు. అందుకని అందరూ మీ దగ్గరికి వెళ్ళమన్నారు. అందుకే వచ్చాను’’ అన్నాడు భరత్‌.