‘‘డిటెక్టివ్ శరత్, నీ అవసరం ఈ కేసులో మాకుంది’’ సూటిగా చెప్పాడు అధికారి.ప్రశ్నార్థకంగా చూశాడు శరత్ అతనివైపు.‘‘సుష్మ అనే యువతి కత్తిగాట్లతో కొనప్రాణంతో ఊరు అవతల రోడ్డు పక్కన దొరికింది. ఆమెని ఆస్పత్రిలో చేర్పించి పోలీసులకు కబురు అందించారు. చాలా తీవ్రమైన కత్తిగాట్లు. ఆమె బ్రతుకుతుందనుకోలేదు. బహుశా కారులోంచి రోడ్డుపైకి విసిరేసిన వాళ్లు కూడా ఆమె చచ్చిపోతుందనే అనుకుని ఉంటారు’’.
అధికారి చెప్పేది ఏకాగ్రతతో వింటున్నాడు శరత్.‘‘కానీ ఆమె వారం పదిరోజులు కొనఊపిరితో కొట్టుమిట్టాడుతూ జీవన్మరణ పోరాటంలో గెలిచింది. ఈలోగా మా పరిశోధనలు మేము చేశాం. ఇదిగో రిపోర్టు’’ అందించి మౌనంగా కూర్చున్నాడు అధికారి. శరత్ విషయం అర్థం చేసుకుని, అక్కడిక్కడే ఆ నివేదికను చదవడం ప్రారంభించాడు.చదవటం పూర్తిచేసి, తలెత్తి అధికారివైపు ప్రశ్నార్థకంగా చూశాడు‘‘అవును. ఆ అమ్మాయి వేశ్య. ఆ అమ్మాయిని ఆ వృత్తిలోకి దింపి డబ్బుచేసుకుంటున్నది బ్రోకర్ భద్రయ్య. కానీ ఇంకా వెనక్కివెళ్తే మొత్తం దేశవ్యాప్తంగా పలురాష్ట్రాలలో ఇలాంటి అక్రమ వ్యాపార సామ్రాజ్యాన్ని నిర్మించిన డాన్ డేనియల్ హస్తం దీనివెనుక కనిపిస్తుంది.
మాదక ద్రవ్యాల అక్రమ రవాణా, పోర్న్ చిత్రాల నిర్మాణం ఇలా పలు వ్యాపారాలు నడిపిస్తున్నాడు డేనియల్. ఇదంతా మనకి తెలుసు. కానీ ఆధారాలు లేవు. ఇప్పుడు ఈ అమ్మాయే మనకు ప్రస్తుతం ఏకైక ఆధారం. ఈమెకు స్పృహవచ్చి, నిజాలు చెప్పటం మొదలుపెడితే మన రొట్టె విరిగి నేతిలో పడ్డట్టే. అయితే అమ్మాయి మనదగ్గర ఉందని తెలిస్తే, వాళ్లు అమ్మాయిని చంపాలని ప్రయత్నించవచ్చు. ఇంతలా హింసించారంటేనే ఈమె ఏదో వాళ్లకి వ్యతిరేకంగా చేసి ఉంటుంది. ఈమెని రక్షించే బాధ్యత నీదే’’ అన్నాడు అధికారి.