‘‘డిటెక్టివ్‌ శరత్‌?’’ ప్రశ్నార్థకంగా అడిగాడతడు.సాధారణంగా శరత్‌ పార్టీలకు వెళ్ళడు. తప్పనిసరి అయితే, మొక్కుబడిగా వెళ్ళి, ముళ్లమీద ఉన్నట్టుండి వచ్చేస్తాడు. అతను వచ్చినట్టు, వెళ్ళినట్టు ఎవరూ గమనించే వీలులేనట్టు వెళ్ళి వస్తాడు.అందుకే కారులో కూర్చోబోతున్న శరత్‌ తనని ప్రశ్నించిన అతనివైపు విసుగ్గా చూసి, ‘‘అవును! ఏం కావాలి?’’ అన్నాడు.అతను వెంటనే ఏడుస్తూ శరత్‌ కాళ్ళ మీద పడబోయాడు.

‘మా అమ్మాయిని మీరే కాపాడాలి. మీ ఆఫీసుకు వెళ్ళాను. ఇక్కడుంటారని సెక్రటరీ చెప్పింది’’ అన్నాడు.అతడిని లేవదీసి, ‘‘కారులో కూర్చోండి’’ అన్నాడు మృదువుగా. ‘‘ఇన్వెస్టిగేట్‌ చేస్తున్నాం. కానీ అంతు చిక్కటం లేదు’’ శరత్‌కి చెప్పాడు ఇన్‌స్పెక్టర్‌ విజయ్‌.అతడిచ్చిన ఫైలులో ఉన్న వివరాలు చదివాడు శరత్‌.‘కీర్తన ఆఫీసు నుంచి ఇంటికి వస్తూ సూపర్‌మార్కెట్‌ దగ్గర ఆగింది. ఆ తరువాత ఆమె, ఆమె కారూ కూడా మిస్‌ అయ్యాయి!పెళ్ళికాని యువతి కీర్తన. తల్లిదండ్రులకు ఒకతే కూతురు. ఇద్దరు ముగ్గురితో సన్నిహితంగా ఉందిగానీ, ఏదీ పెళ్ళిదాకా రాలేదు. ఎవరితోనూ ఆమెకు ఎలాంటి వివాదాలు లేవు. ఆమెను సూపర్‌మార్కెట్‌ దగ్గర చూసినవాళ్ళున్నారు. కానీ తర్వాత ఎటెళ్ళిందో ఎవరూ చెప్పలేక పోతున్నారు.

నగరంలోని ప్రధానదారుల్లోని సి.సి. కెమేరాలలో ఆమె కారు కనబడలేదు’ ఫైల్లో ఉన్న వివరాలు చదివి విజయ్‌ వైపు చూశాడు శరత్‌.‘డెడ్‌ ఎండ్‌’ అన్నాడు విజయ్‌.‘అమ్మాయి మిస్సైపోయి రెండ్రోజులైపోయింది. ఇంట్లోవాళ్లకి ఫోను కూడా చేయలేదు’ తనలో తనే అనుకున్నట్టు చెబుతూ, విజయ్‌వైపు చూశాడు శరత్‌.‘‘ఆమె ఫోన్‌ చివరిసారి ఏక్టివ్‌గా ఉన్నది సూపర్‌మార్కెట్‌ దగ్గరే’’ చెప్పాడు విజయ్‌. తలపంకించాడు శరత్‌.ఇంతలో విజయ్‌ ఫోను మోగింది. ‘‘ఏమిటి? ఎక్కడ? వస్తున్నా’’ అని, ‘‘అమ్మాయి కారు దొరికిందట’’ అని చెప్పాడు.