‘‘నా భార్యను పిల్లవాడిని చంపి ఆత్మహత్య చేసుకున్నాడు నా డ్రైవర్ ధనరాజ్. అతడు వాళ్ళిద్దరినీ అసలు వాడెందుకు చంపాడో మీరు పరిశోధించి తెలుసుకోవాలి’’ డిటెక్టివ్ శరత్‌ని అడిగాడు కరణ్. శరత్ ప్రశ్నార్థకంగా చూశాడు.
ధన్‌రాజ్ మళ్ళీ చెప్పడం ప్రారంభించాడు. ‘‘ధనరాజ్ నా డ్రైవరు. దాదాపు ఇరవైయేళ్ళుపైగా నా దగ్గరే పనిచేస్తూ, నా కుటుంబ సభ్యడిలా మారిపోయాడు. అలాంటివాడు హఠాత్తుగా నా భార్యని, కొడుకుని కాల్చి చంపటం, తనని తాను కాల్చుకుని చచ్చిపోవటం...నేను జీర్ణించుకోలేకపోతున్నాను. అసలు వాడెందుకిలా చేశాడు? నాకు మనశ్శాంతి కరువైపోయింది. పోలీసులు ఈ కేసు క్లోజ్ చేశారు. మీరే పరిశోధించి నిజం వెలికితియ్యాలి’’ బ్రతిమిలాడుతున్నట్టు అడిగాడు కరణ్.‘‘మీరు వివరాలు నా అసిస్టెంట్ రాముకు ఇవ్వండి. నేను పరిశోధిస్తాను’’ అన్నాడు శరత్. ‘‘బాస్, కరణ్ పెద్ద వ్యాపారి. తండ్రినుంచి వారసత్వంగా వచ్చిన వ్యాపారాన్ని మరింతగా అభివృద్ధి చేశాడు.
తరువాత తండ్రి ఎంపిక చేసిన కమలనే వివాహం చేసుకున్నాడు కరణ్. వివాహం గ్రాండ్‌గా జరిగింది. పెళ్ళైన ఏడాదిలోపే ఆదిత్య పుట్టాడు. ఇక పిల్లలు వద్దనుకున్నారు ఇద్దరూ. ఎలాంటి వివాదాలు, గొడవలు ఉన్నట్టు లేవు. ఒక రకంగా మేడ్ ఫర్ ఈచ్ అదర్’’ తను సేకరించిన వివరాలు చెప్పాడు రాము.‘‘మరి ధనరాజ్ సంగతేంటి?’’ అడిగాడు శరత్.‘‘ధనరాజ్ ఎమ్మెస్సీ చదివి డ్రైవర్ ఉద్యోగం చేస్తున్నాడు. అతడికి ఎలాంటి కోరికలు, ఆరాటాలు ఉన్నట్టు లేవు. పెళ్లి చేసుకోలేదు. ఇరవైఏళ్ళుగా కరణ్ ఔట్‌హౌజ్‌లో ఉంటున్నాడు. బంధువులు ఉన్నట్టు లేరు. ఒక్కరోజుకూడా సెలవు తీసుకోలేదు. సినిమాలు, షికార్లు, ఊళ్ళు తిరగడం లాంటివేమీ లేవు. వాళ్ళకోసం కారు బయటకు తీస్తాడు, డ్రైవింగ్ చేస్తాఉ, మళ్ళీ కారు లోపలపెట్టి తన ఇంట్లోకి వెళ్లిపోతాడు. అంతే విచిత్రమైన మనిషి’’ చెప్పాడు రాము.