‘‘భార్య అనుమానస్పదస్థితిలో మరణిస్తే ప్రథమ అనుమానితుడు భర్తే’’ ప్రకాశ్ వైపు సూటిగా చూస్తూ అన్నాడు డిటెక్టివ్ శరత్.‘‘నిజమే, కానీ పూజితను నేను హత్య చేయలేదు. నాకేమీ తెలియదు. పోలీసులు నన్ను అనుమానిస్తున్నారు. నేను నేరం చేయలేదు’ బ్రతిమిలాడుతున్నట్టు అన్నాడు ప్రకాశ్.
‘ఆధారాలు, ఋజువులు కావాలి’ అన్నాడు శరత్.‘నేను నిజం చెప్తున్నాను. మాది పెద్దలు నిశ్చయించిన పెళ్ళి. పెళ్లికిముందు కలిసినప్పుడు నాలుగైదుసార్లు అడిగాను. ‘నేనంటే ఇష్టమేనా? ఎవరినయినా ప్రేమించావా?’ అని ఎవరినీ ప్రేమించలేదంది. పెళ్ళయ్యాక తెలిసింది, క్లాస్‌మేట్ రఘుబాబును ఆమె ప్రేమించిందనీ, ఇద్దరికీ శారీరక సంబంధం ఉందనీ. ‘ఇక నీతోనే జీవితం’ అని చెప్పింది’’ ప్రకాశ్ కళ్ళల్లో క్రోధం, విచారం స్పష్టంగా గమనించాడు శరత్.‘‘ఓరోజు ఆమె బిజీగా ఉన్నసమయంలో, ఒకసారి ఆమె సెల్‌ఫోన్లో వాట్సప్ మెసేజీలు చూశాను. మా ఇద్దరి సన్నిహితసంబంధ వివరాలు వాడితో పంచుకుంటోందని అర్థమైంది.
నాకు కోపం వచ్చింది. పైగా దాన్లో, ‘యూ ఆల్ ది బెస్ట్. మై హబ్బీ ఈజ్ ఎ పప్పు’ అనే మెసేజ్ చూసి భరించలేక పోయాను. ఆరోజు మా మధ్య పెద్ద గొడవ జరిగింది. ఆమెను కొట్టాను. వాళ్లింటికి వెళ్లిపోయింది. వాళ్లవాళ్లు వచ్చి నన్ను బ్రతిమిలాడేరు, ‘తను తప్పు ఒప్పుకుంది. ఇంకోసారి వాడితో సంబంధం పెట్టుకోనని చెప్పింది’ అన్నారువాళ్ళు. మా వాళ్లు కూడా ఒత్తిడి చేయడంవల్ల కాపురం కంటిన్యూ చేశాం’’ ఒక్కసారిగా ఆగాడు ప్రకాశ్. చెప్పండి అని సౌంజ్ఞ చేశాడు శరత్.‘‘కొన్నాళ్ళు బాగానే ఉంది. కానీ వాడిని మరచిపోలేదు. ఆఫీసుమధ్యలో వెళ్లి వాడితో గడుపుతోందని తెలిసింది’’.‘‘అదెలా?’’ అడిగాడు శరత్.