ఆ రోజు వచ్చిన దినపత్రికను ఆసక్తిగా తిరగేస్తున్నాడు జనార్దన్.అతనికి అందులో ఎంతో ఇష్టమైన శీర్షిక ‘క్రైమ్ కార్నర్’.ఆ కాలమ్‌లోని వార్తల్ని అక్షరం వదలకుండా ఏకాగ్రతతో చదవసాగాడు.ప్రతీరోజు పేపర్ రాగానే ఆ కాలమ్‌ను చదవడం అతని దినచర్యల్లో భాగంగా మారి పోయింది.
ఆ కాలమ్ కింద దేశంలోని నగరాలలో, పట్టణాలలో, గ్రామాల్లో జరిగిన నేరాలు, హత్యలు, మానభంగాలు, ప్రమాదాలు గురించి వార్తలు ప్రచురితమవుతాయి.వార్తలు చదవటం ముగించి ఉస్సూరుమంటూ పేపర్ని టేబుల్‌పై పడేశాడు.ఈసారి కూడా అతనికి కావలసిన సమాచారం ఆ కాలమ్‌లో కనిపించలేదు.‘‘జనార్దన్! జనార్దన్’’ అని మేడపై నుంచి కేకలు వినిపించటంతో జనార్దన్ గబగబా మేడపైకి వెళ్ళాడు.ఆ విశాలమైన గది మధ్యలో విశాలమైన మంచం మీద ఎనభై ఏళ్ళ వృద్ధురాలు పడుకుని ఉంది. దాదాపు పదేళ్ళ నుంచి ఆమె మృత్యువుతో పోరాడుతోంది. ఆమెకు సపర్యలు చేసి చేసీ అతను అలసిపోయాడు. అయినా తన విసుగును ఆమె ముందు ప్రదర్శించేవాడు కాదు. అందుకు కారణం ఆమె మరణానంతరం ఆమె ఆస్తింతా అతనికే వస్తుంది. ఆమె అతను తప్ప ఇతర వారసులెవరూ లేరు.‘‘జానూ కాస్త కాఫీ ఇవ్వరా...’’‘‘ఇప్పుడే ఇస్తాను’’ అని జనార్దన్ వంటింట్లోకి పరుగెత్తాడు.క్షణాల్లో కాఫీ చేసి ఆమె చేతికి అందించాడు.కాఫీ తాగాక ‘‘బజారు నుంచి వచ్చేటప్పుడు కేకు, రస్కులు తీసుకునిరా, చాయ్‌తో పాటు తింటాను’’ అందామె.‘‘అలాగే అమ్మమ్మ’’ అన్నాడు వినయంగా జనార్దన్.
అక్కడి నుంచి అతను నేరుగా తన ప్రియురాలు రాణి ఇంటికి వెళ్ళాడు.ఆమె కనిపించగానే దగ్గరికి లాక్కున్నాడు.ఆమె ఎర్రటి పెదవులను గాఢంగా చుంబించాడు.అతనిచేతులు ఆమెను ఒంటినంతా తడుముతూ జాకెట్టు హుక్స్‌ను అందుకున్నాయి.ఆమె అతని చేతిని పక్కకు నెట్టేస్తూ–‘‘వదులు, మీ అమ్మమ్మ చనిపోగానే నన్ను పెళ్ళాడుతానని రెండేళ్ళ నుంచి చెబుతూ నాతో కాలక్షేపం చేస్తున్నావు. ఆమె చావాలని ప్రతీరోజు దేవుడికి మొక్కిమొక్కి చాలైంది. ఆమె ఎప్పుడు చస్తుందో కాని మనం ముసలివాళ్ళవటం మాత్రం ఖాయమనిపిస్తోంది’’.‘‘ఇందులో నా తప్పుఏముంది డార్లింగ్! ఎన్నో వ్యాధులున్నా చావకుండా గట్టిగా ఉన్నా ఆ ముసలిదాన్ని చూస్తే నాకే పిచ్చెక్కుతుంది’’ అన్నాడు.