అతడో సూపర్‌హిట్‌ చిత్రాల దర్శకుడు. ప్రతీదీ ముందు రిహార్సల్స్‌ చేసి ఆ ప్రకారం స్ర్కిప్టు రాసుకుంటాడు . కొత్త సినిమా తీయడానికి రిహార్సల్స్‌ ద్వారా స్ర్కిప్టు తయారుచేస్తున్నాడతను. అప్పుడే ఎవరో గుర్తుతెలియని వ్యక్తి ఆ దర్శకుణ్ణి కాల్చి చంపేశారు. పథకం ప్రకారం ఈ హత్య చేశారని డిటెక్టివ్‌ శరత్‌ గుర్తించాడు. కానీ ఎక్కడా ఆధారాలు మాత్రం లేవు. ఎలా? అతణ్ణి ఎందుకు చంపారు? ఇంతకీ హంతకుడెవరు?

*********************

‘‘ఇన్‌స్పెక్టర్‌ విజయ్‌ ఇచ్చిన వీడియోని ఏకాగ్రతతో చూడటం ఆరంభించాడు డిటెక్టివ్‌ శరత్‌. ఓ మనిషి టేబుల్‌ దగ్గర రాసుకుంటున్నాడు. కాస్సేపటికి మరో వ్యక్తి అతనిదగ్గరకు వచ్చాడు. అతను మారు వేషం వేసుకున్నట్టు తెలుస్తోంది. రాసుకుంటున్న వ్యక్తి లేచి వెళ్లి ఆ వ్యక్తిని కౌగలించుకున్నాడు. షేక్‌ హ్యాండిచ్చాడు.ఆ మారువేషం వ్యక్తి హఠాత్తుగా కౌగలించుకున్న వ్యక్తిని వెనక్కు తోశాడు. జేబులోంచి తుపాకీ తీసి మూడుసార్లు కాల్చి నిశ్శబ్దంగా వెళ్ళి పోయాడు.‘హతుడెవరు’ అన్నట్టుగా వీడియోలోంచి తలెత్తి విజయ్‌వైపు చూశాడు శరత్‌.‘‘హత్యకు గురైంది ప్రఖ్యాత సినీ దర్శకుడు సంపత్‌ శుక్ల’’ చెప్పాడు విజయ్‌. మరోసారి వీడియో చూశాడు శరత్‌.‘‘సి.సి. కెమేరాలో అంతా రికార్డ్‌ అయింది. కానీ మారువేషం వ్యక్తి ముఖం క్లియర్‌గా లేదు. హంతకుడితో శుక్లాకు బాగా పరిచయం ఉన్నట్టుంది. హత్య ఎవరు చేశారో, ఎందుకు చేశారో తేలలేదు’’ చెప్పాడు విజయ్‌. మరోసారి వీడియో చూశాడు.‘‘హత్యాస్థలంలో ఆధారాలేమైనా.....’’ శరత్‌ అడిగేలోపే తల అడ్డంగా ఊపాడు విజయ్‌.

‘‘చూశావుగా, హంతకుడు గదిలో దేన్నీ ముట్టలేదు. వచ్చాడు. కాల్చాడు, వెళ్ళిపోయాడు. చూశావా?శుక్లా అతడిని కౌగలించుకున్నాడు గానీ అతడు శుక్లాను కౌగలించుకోకోలేదు. కనీసం హతుడి బట్టల పైపైనా వేలిముద్రలో, డి.న్‌ఎన్‌.ఎనో దొరికే వీలునివ్వలేదు’’ అన్నాడు శరత్‌.‘‘శుక్లా సౌమ్యుడు. అజాతశత్రువు అనే చెబుతున్నారు ప్రతివాళ్ళూ. అయినా సరే అతనికి ఎవరితోనైనా శత్రుత్వం ఉందేమోనని పరిశీలించాం. ఎవరికైనా అవకాశం ఇస్తానని మాటిచ్చితప్పడం, నటితో అక్రమ సంబంధాలు...లాంటివి కూడా చూశాం, అతి పవిత్రుడిలా ఉన్నాడు శుక్లా’’ అన్నాడు విజయ్‌.‘‘మరి హత్య తీరుచూస్తే, పథకం ప్రకారం చేసినట్టుంది’’ అన్నాడు శరత్‌.