‘‘నేను శ్రీనివాసరావు. గవర్నమెంటుసర్వీసులో అతిపెద్ద పోస్టులో రిటైరయ్యాను. నాకు మీ సహాయం కావాలి’’ అన్నాడు.తన ఎదురుగా కూర్చున్న ఆ వ్యక్తిని ప్రశ్నార్థకంగా చూశాడు డిటెక్టివ్ శరత్.‘‘నా కూతురిని మానభంగం చేసి చంపేశాడు జేమ్స్‌పాట్రిక్’’.‘‘మీరు స్ట్రిక్ట్ శ్రీనివాసరావుగారా?’’ అడిగాడు శరత్.
‘‘అవును. రిటైరైపోయాను. ఇప్పుడు స్ట్రిక్ట్ అని ఎవరూ అనరు’’ అన్నాడాయన నవ్వుతూ.శరత్‌కు ఈ కేసు గుర్తుంది. దాదాపుగా పది పదిహేనేళ్ల క్రితం నాటి కేసు.పద్దెనిమిదేళ్ల శ్రీనివాసరావు కూతురు శిరీష ఒకరోజు కాలేజీకి వెళ్లి మళ్ళీ ఇంటికి రాలేదు.వారం రోజుల తరువాత ఆమె శవం దొరికింది. పోలీసుల పరిశోధన ఎటూ తేలలేదు. ఐతే, జేమ్స్‌పాట్రిక్ అనే ఫిజికల్ ట్రైనర్‌తో ఆమె సన్నిహితంగా ఉంటుందని తెలియటంతో పోలీసులు అతడిని ప్రశ్నించారు.శిరీషతో తనకు సాన్నిహిత్యం ఉన్నట్టు అతడు ఒప్పుకున్నాడు. అతడికి ముప్ఫైఏళ్ళు పైనే ఉంటాయతనికి. పెళ్లయింది. ఆ రోజు కాలేజీ తరువాత ఇద్దరం కలిసి కామత్‌లో కాఫీ తాగి, ఎవరిదారిన వారు వెళ్లిపోయామని చెప్పాడు. అతడు చెప్పింది నిజమే అని పోలీసు దర్యాప్తులో నిర్ధారణైంది.
మరి శిరీష ఆ తర్వాత ఎటు వెళ్లిందో, ఏమయిందో పోలీసులు ఎన్నిరకాలుగా పరిశోధించినా ఏమీ తేలలేదు. జేమ్స్‌పాట్రిక్ విషయంలో ఆధారాలులేవు. అదిక అటకెక్కిన కేసుగా మారిపోయింది. శ్రీనివాసరావు ఆఫీసులో స్ట్రిక్ట్‌గా ఉంటాడని, ఎవరో ప్రతీకారంగా ఈ పనిచేసి ఉంటారనీ ఓ పత్రికాకథనం వెలువడింది. ఆ దిశగా చేసిన పరిశోధనలో కూడా ఏమీ తేలలేదు.అప్పుడు విన్నాడు శరత్ స్ట్రిక్ట్ శ్రీనివాసరావు పేరు.‘‘కానీ ఇన్నేళ్లయింది. అన్నిరకాలుగా, అన్ని కోణాలలోనూ పరిశోధించి పోలీసులు ఏమీ తేల్చ లేకపోయారు. ఇన్నేళ్ల తరువాత కేసును తిరగతోడినా ఏం సాధించగలం? ఇప్పుడు చూసింది మరుక్షణంలో మరచిపోయే సమాజంలో పదిహేనేళ్లనాటికేసుని గుర్తుంచుకుంటుందనుకోవటం పొరపాటు’’ అన్నాడు శరత్.