సీతకి నూటైదు జ్వరం. రాత్రంతా దగ్గుతూనే వుంది. ఓ రాత్రి వేళ ఆమెకు దగ్గు ఎక్కువైతే లేచి రెండు చెంచాల ‘కాఫ్‌ సిరప్‌’ ఇచ్చి. గుండెల దాకా దుప్పటి కప్పి, పడుకోమని చెప్పి, అలా ముందు గదిలోకొచ్చి యధాలాపంగా కిటికీలోంచి చీకట్లోకి చూస్తూ నిలుచున్నా.పగలంతా రణగొణ ధ్వనులు, ఆర్తనాదాలు చేసి అలసిపోయిన ప్రపంచం స్తబ్దుగా అలా నిద్రపోతూ వుంటే చూడడం నాకిష్టం. కొద్దిసేపు అలా నిలబడ్డాను.ఎవరో ఓ వ్యక్తి మెల్లగా నడుస్తూ ముందుకెళ్లి, మళ్లీ వెనక్కి వచ్చి ఎదురింటి ముందు ఆగేడు. అతని ప్రవర్తన అనుమానాస్పదంగా కనిపించి నాకు. వీధి దీపం వెలుగులో కాస్త స్పష్టంగానే కనిపిస్తున్నాడు. ఒక్క క్షణం అటూ ఇటూ చూసి వాళ్ల పిట్టగోడెక్కి లోపలకి దూకేడు. నా గుండె ఝల్లుమంది.

 దొంగలనెపడూ అలా ప్రత్యక్షంగా యాక్షన్‌లో చూడలేదు నేను. త్వరగా లోపలకొచ్చి సీతకి చెప్పాను. ఏం చెయ్యాలి? ఇద్దరికీ కంగారుగానే వుంది.ఆ ఇంటి యజమానికి ఫోన్‌ చేస్తే? బాగానే వుంటుందంది సీత. వెంటనే టెలిఫోన్‌ బుక్‌ తీసి నెంబరు చూసి విఠల్‌రావు గారికి ఫోన్‌ చేశా. బహుశా గాఢ నిద్రలో వున్నారేమో... నాలుగైదురింగులకి గాని ఫోన్‌ తియ్యలేదు. వాళ్లావిడ రంజని గారు ‘‘హలో’’ అంది. నేను ఫలానా అని చెపకొని, వాళ్ల కాంపౌండులోకి మనిషి దూకిన సంగతి చెప్పి, విఠల్‌రావుగారిని పిలవమన్నాను లైన్లోకి.

ఆయన క్యాంపుకెళ్లాడట. ఆమె ఒక్కతే వుంది. నేను విషయం చెప్పగానే భయపడిపోయింది. ‘‘దేవుడా...దేవుడా’’ అంటూ ఏడుపు లంకించుకుంది. ఫరవాలేదంటూ ధైర్యం చెప్పి, నేను వెంటనే వస్తున్నానన్నాను. అందాకా తలుపు తియ్యవద్దని, చపడు చెయ్యవద్దని కూడా చెప్పాను. సాహసం చేసి, ఎలాగైనా దొంగని పట్టుకోవాలని నాకు ఆరాటంగా వుంది.తీరా ప్యాంటు వేసుకని బయల్దేరబోతూ వుంటే సీత అంది. ‘‘ఆమె భర్త ఊళ్లో లేనపడు మీరు వొంటరిగా వెళ్లడం బావుండదు. ఇంకెవరినైనా తోడు తీసుకెళ్లండి’’ అని. నిజమేననిపించి, టెలిఫోన్‌ బుక్‌ దగ్గర పెట్టుకొని పక్కింటి ఏలేశ్వర్రావుకి ఫోన్‌ చేశా.