సాయంత్రం నాలుగు గంటల సమయం...మీరట్ పట్టణం నుంచి దూరంగా విసిరి వేసినట్టుండే కాజీసరాయ్ ప్రాంతం.వీధిలో జనసంచారం తక్కువగా ఉంది.పోలీస్ జీపు వేగంగా వచ్చి అక్కడ ఆగింది.జీపులో వచ్చిన పోలీసులు హుటాహుటిన జీపు దిగారు. ఇన్‌స్పెక్టర్ జాదవ్ జీపు నుంచి కిందికి దిగి చుట్టుపక్కలంతా దృష్టి సారించాడు.
ఊరి నుంచి దూరంగా ఉన్న ఆ ప్రాంతంలో ఓ వేపచెట్టు.ఆ చెట్టు కింద ఓ గుడిసె.సరిగ్గా ఆ గుడిసె ముందు కొందరు గుమిగూడి ఉన్నారు.పోలీస్ జీపు ఆగటం చూసిన జనం భయంతో పక్కకు తప్పుకున్నారు.ఇన్‌స్పెక్టర్ జాదవ్ తన సిబ్బందితో ఆ గుడిసెను సమీపించాడు.చూపరుల గుండెల్ని జలదరింపచేసేలా పాతికేళ్ళ యువతి శవం రక్తపు మడుగులో వెల్లకిలా పడి ఉంది. ఆమె వొంటి మీది దుస్తులు అస్తవ్యస్తంగా చెదిరిపోయి ఉన్నాయి. ఆమె మెడ మీద, వక్ష స్థలంలోను, పొట్టమీద కత్తిపోట్ల తాలూకు గాయాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఆ గాయాల నుండి స్రవించిన రక్తంతో ఆమె శరీరమంతా దాదాపు రక్తమయంగా ఉంది. ఆమె సమీపంలోనే నాలుగైదు నెలల పసికందు శవం కూడా పడి ఉంది.
ఆ పసిగుడ్డు ముఖమంతా మట్టికొట్టుకుని నల్లగా కమిలిపోయి, రక్తసిక్తమై ఉండటాన్ని బట్టి బహుశా ఆ పసిదాని కాళ్ళను పట్టుకుని నేలకేసి బాది చంపినట్టు తెలుస్తోంది. బహుశా మృతులిద్దరూ తల్లీబిడ్డలై ఉండొచ్చు.ఇన్‌స్పెక్టర్ జాదవ్ శవాన్ని క్షుణ్ణంగా పరిశీలించాడు. రాతిగుండె గల రాక్షసుడు మాత్రమే ఇలాంటి దారుణ మారణకాండకు పూనుకుని ఉంటాడని అనుకున్నాడు. అయితే ఆ నరరూప రాక్షసుడ్ని పట్టి బంధించడానికి ఉపయోగపడే ఆధారమేమీ ఘటనా స్థలంలో దొరకలేదు. అక్కడ గుమిగూడిన జనం నుంచి కూడా పరిశోధనకు ఉపయోగపడే సమాచారం దొరకలేదు. ఆ శవాన్ని గుర్తు పట్టకపోవటంతో మృతిచెందిన ఇద్దరూ తల్లిబిడ్డలు కావచ్చని, అయితే కాజీసరాయ్ ప్రాంతానికి చెంది ఉండక పోవచ్చని జాదవ్ ఒక నిర్ణయానికి వచ్చాడు.పోలీస్ ఫొటోగ్రాఫర్లు, ఫింగర్‌ప్రింట్స్ ఎక్స్‌పర్ట్‌లు తమ పనులు ముగించుకుని పోయాక, ఇన్‌స్పెక్టర్ జాదవ్ శవ పంచనామా జరిపించి శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించాడు.