‘హాయ్‌...’ ఫేస్‌బుక్‌లో రిక్వెస్ట్‌ పంపిన అమ్మాయి ప్రొఫైల్‌ ఫోటో చూస్తే టెంప్టింగ్‌గా ఉంది.ఫేస్‌బుక్‌ను రెగ్యులర్‌గా ఫాలో అయ్యే ప్రకాశ్‌ మరో ఆలోచన లేకుండా ‘హలో’ అంటూ రిక్వెస్ట్‌ను యాక్సెప్ట్‌ చేశాడు.మాటలు కలిశాయి. పరిచయం పెరిగింది. కొన్నాళ్లకు చాటింగ్‌ ‘హాయ్‌’ నుంచి ‘నాటీ’ల మీదుగా ‘స్వీట్‌ డ్రీమ్స్‌’ వరకు వెళ్లింది. ఆ అమెరికన్‌ యువతి పేరు ఫ్రాన్సిస్‌.హైదరాబాద్‌లో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం చేస్తున్నాడు ప్రకాశ్‌. అదృష్టం కలిసొచ్చి బాగా సంపాదించాడు. సోషల్‌ నెట్‌వర్క్‌లో యాక్టివ్‌గా ఉంటాడు. ఫేస్‌బుక్‌లో ఫ్రెండ్స్‌ ఎక్కువే. దేశ విదేశాలకు చెందిన వారితో ఫ్రెండ్‌షిప్‌ చేసుకున్నాడు. 

వారితో రెగ్యులర్‌గా చాట్‌ చేస్తుంటాడు.కొత్తగా పరిచయమైన ఫ్రాన్సిస్‌ చిన్న వయసులోనే అమెరికాలో మంచి ఉద్యోగం చేస్తున్నట్టు చాటింగ్‌ ద్వారా తెలిసింది. మెసేంజర్‌లో పర్సనల్‌ ఫోటోల షేరింగ్‌ దాకా వెళ్లింది వ్యవహారం. ఫ్రాన్సిస్‌ అంటే ప్రకాశ్‌కు చచ్చేంత ఇష్టం. తను లేనిదే జీవితం లేదన్నట్టుగా తయారయ్యాడు.ఫోన్‌లో మెసేజ్‌ అలెర్ట్‌ సౌండ్‌ వినిపించగానే ఆత్రుతగా చూశాడు.‘‘హాయ్‌ ప్రకాశ్‌... హౌ ఆర్‌ యూ’’ ఫ్రాన్సిస్‌ పలకరింపు.‘‘ఐయామ్‌ ఫైన్‌... హౌ ఎబౌట్‌ యూ డార్లింగ్‌...’’‘‘దీజ్‌ ఆర్‌ మై న్యూ ఫోటోస్‌... సీ అండ్‌ ఎంజాయ్‌...’’ అంటూ కొన్ని పోస్ట్‌ చేసింది.రెచ్చగొడుతూ హాట్‌ హాట్‌గా ఉన్న ఆ ఫోటో చూడగానే ప్రకాశ్‌ గొంతు తడారిపోయింది.‘‘ఇండియాకు రా... నీకు స్వర్గం చూపిస్తా...’’ అంటూ వెంటనే మెసేజ్‌ పెట్టాడు.

ప్రకాశ్‌ ఊహాలోకాల్లో తేలియాడుతుండగా ఒకరోజు ఫ్రాన్సిస్‌ నుంచి మెసేజ్‌ వచ్చింది.‘అమెరికన్‌ ఆర్మీలో తాను పనిచేస్తున్నానని, తనను ప్రస్తుతం ఐక్యరాజ్యసమితి దళాల్లో భాగంగా ఇరాక్‌ పంపించారని’ ఆ మెసేజ్‌ సారాంశం.ఇంకోరోజు ‘‘డియర్‌... నేను ఇరాక్‌ నుంచి నీ వద్దకు త్వరలో వస్తాను. అయితే, అమెరికాలో నా పేరిట చాలా డబ్బు ఉంది. ఎటూ జాబ్‌ రిజైన్‌ చేసి నీ దగ్గరకు రాబోతున్నా కదా!. ఆ డబ్బు నీకు పంపిస్తా...’’‘‘ ఓకే...’’‘‘నా అకౌంట్‌లో ఉన్న 5.6 మిలియన్‌ డాలర్లను రెడ్‌క్రాస్‌ ఏజెంట్‌ విలియమ్స్‌ దగ్గర డిపాజిట్‌ చేస్తున్నా. నువ్వు అతడితో మాట్లాడి డబ్బు తెప్పించుకో’’ అని ఫ్రాన్సిస్‌ మెసేజ్‌ ఇవ్వడంతో ప్రకాశ్‌ మనసు గాలిలో తేలిపోయింది.