కారొచ్చి ఠక్కున పక్కన ఆగే సరికి ఇటు చూసింది ముప్ఫై ఐదేళ్ళ శైలజా ద్వివేది. ఎక్కమన్నాడతను. ఎక్కికూర్చున్నాక కారు పోనిస్తూ, ఇప్పుడేం చేస్తానో చూడమన్నాడు. భార్యకి కాల్ చేసి, ‘డైవోర్స్ నోటీసులొస్తున్నాయ్ ... రెడీ ఐపో!’ అనేసి ఆమె వైపు తిరిగి, ‘ఓకేనా ఇప్పుడు నాతో పెళ్ళీ?’ అన్నాడు. కారు ఆపమంది వెంటనే. రెచ్చిపోయి బ్రేకేసి పొడవాటి కత్తి తీశాడు సైకోలా...
ఢిల్లీ కంటోన్మెంట్ ఏరియాలోని బ్రార్ స్క్వర్ రోడ్డంతా ఖాళీగా వుంది. కసకసా సైకోలా గొంతుమీద కత్తితో దాడి చేసి, కారులోంచి రోడ్డుమీదికి లాగి, ఆమె తల మీదుగా కారు పోనిచ్చాడు. ఆమె మొబైల్‌లో వాట్సాప్ చాట్స్, గూగుల్ డ్రైవ్‌లో వున్న ఫైల్సు డిలీట్ చేసి పారేశాడు. ఎవరికో కాల్ చేసి, శైలజని ఫినిష్ చేశానని చెప్పేశాడు. ఇంటికెళ్తే, కారెలా డ్యామేజీ అయిందని భార్య అడిగింది. కుక్క అడ్డమొచ్చిందన్నాడు. విడాకులేమిటని అడిగింది. నోర్ముయ్యమన్నాడు. తండ్రి ఇంటికెళ్ళి పోయాడు. అక్కడ్నుంచి తమ్ముడి దగ్గరికి వెళ్ళి డబ్బు తీసుకుని, దూసుకుపోయాడు అదే వైట్ హోండా సిటీ కారులో. ఎంతకీ శైలజ ఫోన్ పలక్క పోయేసరికి, ఆర్మీ హాస్పిటల్‌కి చేరుకున్నాడు మేజర్ అమిత్ ద్వివేది.
అక్కడామె హోండా కారెక్కి వెళ్లిందని తెలిసి పోలీస్ ేస్టషన్‌కి పరుగెత్తాడు. బ్రార్ స్క్వేర్ రోడ్డులో పోలీసులున్నారని తెలుసుకుని అక్కడికి పరుగెత్తి, చితికిన భార్య శవాన్ని చూసి భోరుమన్నాడు - ‘ఇట్స్ మర్డర్, యాక్సిడెంట్ కాదు!’ అని గట్టిగా అరిచాడు.‘వ్వాట్?’‘మూడేళ్ళుగా హెరాస్ చేస్తున్నాడు నా మిసెస్‌ని, పెళ్లి చేసుకోమని!’‘ఎవరు?’‘మేజర్ - మేజర్ నిఖిల్ హండా!’షాకయ్యారు పోలీసులు. మేజర్ భార్యని ఇంకో మేజర్ చంపాడా? సీనియర్ ఇన్‌స్పెక్టర్ విజయకుమార్ వెంటనే ఆర్మీ ఆస్పత్రికెళ్ళి సీసీ ఫుటేజీ చూసి సీజ్ చేశాడు. అక్కడికి ఫిజియో థెరఫీ కోసం వచ్చిన శైలజ, మేజర్ హండా ఉన్న వైట్ హోండా సిటీ కారెక్కి వెళ్లినట్టు ఫుటేజీలో వుంది. జాయింట్ కమిషనర్ మధుప్ తివారీ, డీసీపీ కుమార్‌లు వెంటనే రంగంలోకి దూకారు.