‘‘బాస్... ప్రఖ్యాత గాయకుడు సురేంద్ర వచ్చాడు’’ ఆయాస పడుతూ లోపలికి వచ్చి చెప్పింది సెక్రటరీ సుధ.డిటెక్టివ్ శరత్‌ని చూసి నవ్వాడు అసిస్టెట్ రాము.‘‘లోపలికి పంపించు’’ అన్నాడు శరత్.కాస్సేపటికి సురేంద్ర లోపలకు వచ్చి, శరత్‌ని చూసి నవ్వాడు. ఎదురుగా కూర్చుంటూ, ‘‘నాకు వ్యతిరేకంగా కుట్ర జరుగుతోంది. నా కెరీర్ దెబ్బతీయాలని ఎవరో ప్రయత్నిస్తున్నారు. నేను ఎవరికీ అన్యాయం చేయలేదు. ఎవరినీ అణగద్రొక్కాలని ప్రయత్నించలేదు. ఐనా ఎవరో నా గొంతు నొక్కేయాలని చూస్తున్నారు. మీరే నన్ను రక్షించాలి’ అన్నాడు.
‘‘అసలు ఏం జరిగింది?’’ అడిగాడు శరత్.‘‘వినీల అనే అమ్మాయి గాయకురాలట. నేను తనని లైంగికంగా వేధించానని ప్రకటించింది. అందరూ ఆమెనే నమ్ముతున్నారు. నన్ను పురుగుని చూసినట్టు చూస్తున్నారు. నా భార్య నన్ను వదిలి వెళ్ళి పోతానంటోంది. పాటలు పాడేందుకు నన్ను బుక్ చేసుకున్నవారు, అగ్రిమెంట్స్ క్యాన్సిల్ చేసుకుంటున్నారు. చేయని నేరానికి నన్ను దోషిని చేస్తున్నారు. నన్ను ఎవ్వరూ నమ్మటంలేదు’’ అతడి స్వరంలో ఆవేదన స్పష్టంగా ధ్వనించింది.‘‘ఏం జరిగిందో చెప్పండి?’’ అడిగాడు శరత్.‘‘వినీల ఎవరో కూడా నాకు గుర్తులేదు.
నేను సినిమాలకు ముందు నేను క్లబ్బుల్లో పాటలు పాడేవాడిని స్టేజి షోలు చేసేవాణ్ణి. అప్పుడు అవసరాన్నిబట్టి నా షోల్లో స్థానిక గాయనీగాయకులు కూడా పాటలు పాడేవారు. అలా వినీల నాకు పరిచయం. ఏవో రెండు షోల్లో పాడింది. తరువాత నేను సినిమాల్లోకి వచ్చాను. ఆమెని మరచిపోయాను. ఇప్పుడు ఆమె ప్రొద్దున్నే ప్రెస్‌మీట్ పెట్టి నా మీద ఆరోపణలు చేసింది. అప్పటివరకు ఆమె నాకు అస్సలు గుర్తులేదు’’.‘‘ప్రెస్‌మీట్‌లో ఆమె ఏం చెప్పింది?’’