‘‘ప్రస్తుతం సమాజంలో ప్రతివ్యక్తి అస్తిత్వంకోసం పోరాటం చేస్తున్నాడు. మంచిచెడు మరచి తాత్కాలిక లాభాలకోసం శాశ్వతంగా తీరనినష్టం కలిగే పనులు చేసేందుకైనా వెరవటంలేదు. సోషల్‌మీడియా కోతికి కొబ్బరికాయలా దొరకడంతో, ఇల్లెక్కినకోడిలా పదిమంది అరిస్తే అదే నిజం అనుకునే పరిస్థితులు నెలకొంటున్నాయి. దీనివల్ల నేరం చేయనివాడు దోషిగా మారుతున్నాడు. దోషి నిజాయితీపరుడై, నిర్దోషిని దోషిగా నిలబెడుతున్నాడు, కాబట్టి ఏదైనా వినగానే నిజమని నమ్మకూడదు. విచక్షణ ఉపయోగించాలి. నిజం నిలకడ మీద తెలిసేలోపు అబద్ధం పధ్నాలుగు లోకాలు చుట్టి వస్తుంది.’’
ఏదో శబ్దం రావడంతో లెక్చర్ ఆపి ఆ వైపు చూశాడు డిటెక్టివ్ శరత్. ఔత్సాహిక అపరాధ పరిశోధకుల శిక్షణా సమావేశంలో ప్రసంగిస్తున్నాడు శరత్.అసిస్టెంట్ రాము ‘అర్జంట్’ అని సంజ్ఞ చేశాడు.‘‘నేను చెప్పిన అంశం ఆధారంగా సోషల్ మీడియా పోస్టులను పరిశీలించి అబద్ధాన్ని నిజంగా ప్రచారంచేసి నమ్మించిన సంఘటనల జాబితా తయారుచేయండి’’ చెప్పి బయటకు నడిచాడు శరత్.ప్రైవేట్ గదిలో అడుగు పెడుతూనే ఆశ్చర్యంగా ఆగిపోయాడు శరత్. ‘‘నేను కేబినెట్‌మంత్రినే అయినా, నిన్ను అభ్యర్థిస్తున్నాను. ఈ విషయంలో నిజం ఏమిటో నిర్థారించాలి. గొడవ రానురాను పెరిగిపోతోంది. ప్రభుత్వానికే ఎసరు పెట్టేటట్టుంది’’ అభ్యర్థనలో ఆజ్ఞ కూడా ఉంది.తల ఊపాడు శరత్.మంత్రి వెళ్ళిపోగానే రామువైపు తిరిగాడు. ‘‘రాము.. కేసు వివరాలు పూర్తిగా సేకరించు’’ అన్నాడు.
రాము వెళ్ళగానే ఇన్‌స్పెక్టర్ విజయ్‌కి ఫోను చేశాడు. ‘‘విజయ్, ఇప్పుడే చంద్రం ఆత్మహత్య కేసును మంత్రి నాకు అప్పగించారు. నేను వస్తున్నాను’’ అని చెప్పి ఆలోచిస్తూ బయటకు నడిచాడు. ‘‘చంద్రం మంచి విద్యార్థి. మార్కులు చక్కగావస్తున్నాయి. ఇంకా ఎంతో సాధించాలన్న ఆశలున్న వ్యక్తి. కానీ అతడు ఓ అమ్మాయికి బూతుబొమ్మలు పంపించాడు. ఆ అమ్మాయి ప్రిన్సిపాల్‌కి ఫిర్యాదు చేసింది. దాంతో ప్రిన్సిపాల్ అతడిని సస్పెండ్ చేశాడు. ఇంతవరకూ బాగానే ఉంది. ఇక్కడే మరి ఎలా జరిగిందో తెలియదు. కానీ, ‘కులం’ ప్రసక్తి రంగప్రవేశం చేసింది.
అణచివేతలు, అన్యాయాలు వేదికపైకి వచ్చాయి. విద్యార్థుల ఉద్యమం మొదలైంది. అది ఇంకా ఆరంభదశలోనే చంద్రం ఆత్మహత్య చేసుకున్నాడు. దాంతో గొడవ తారాస్థాయికి చేరుకుంది. రాజకీయాలు రంగప్రవేశం చేశాయి. ఇది ‘ప్రభుత్వంచేసిన హత్య’ అని మంత్రులు రాజీనామా చేయాలని ఉద్యమం ఆరంభమైంది. ఉద్యమకారులు హింసకు దిగటంతో ఫైరింగ్ చేయాల్సి వచ్చింది. ఇద్దరు మరణించారు. ఉద్యమం కాలేజీ పరిధి దాటి అసెంబ్లీ స్థాయికి చేరుకుంది’’ కేసు స్వరూపం వివరించాడు విజయ్.