ఆమె: నన్ను నమ్మవు కదూ?

అతను: నువ్వెక్కడున్నావ్‌?

ఆమె: ఢిల్లీ వస్తున్నా!

తను: నేనే కాన్పూర్‌ వస్తున్నా!

ఆమె: ఇవ్వాళ తేలిపోవాలి

అతను: తేల్చాల్సింది నేనూ

ఆమె: దౌర్జన్యంతో ఏమీ చేయలేవ్‌!

అతను: ఎక్కువ మాట్లాడక. సరే, అలాగే రా ఢిల్లీకి.

ఆమె: బ్రహ్మకి కూడా సాధ్యం కాదు నా బిడ్డని నా నుంచి దూరం చేయడం!

కాన్పూర్‌లో ఆమె ఉరేసుకుని చనిపోయింది. ప్రతిభ ఆత్మహత్య మిస్టరీగా మారింది... ఉన్నతస్థాయి దర్యాప్తు చేపట్టిన ఏఎస్పీ మాథుర్‌కి. ఇంట్లో కాదన్నా అభిషేక్‌ని ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఏడాది లోపే ఆత్మహత్య చేసుకుంది. ఇంట్లో ఆమె డ్రైవర్‌, పని మనిషి పత్తా లేరు. ఆమె ఒంటి మీద బలమైన గాయాలున్నాయి. చేతుల మీద కత్తితో చేసినట్టు పన్నెండు గాట్లున్నాయి. ‘ఇది ఆత్మహత్యే! నేనే బాడీని దించి కంప్లయింట్‌ చేశాను’ అని భర్త అభిషేక్‌ స్టేట్‌మెంట్‌.‘నిన్న ఢిల్లీ వచ్చింది. నాతో గొడవ పెట్టుకుని రాత్రికిరాత్రే వెళ్లిపోయింది. ఫోన్లు చేస్తూంటే స్విచ్చాఫ్‌ పెట్టింది. ఉండలేక నేనే వచ్చేశాను. తలుపు తీయకపోతే విరగ్గొట్టి లోపలి కెళ్తే... ఫ్యానుకి వేలాడుతూ కన్పించింది...’,‘ఎందుకు గొడవ పడ్డారో?’,‘అదీ... అదీ... మా పర్సనల్‌ లెండి’,‘ఇది ఆత్మహత్య అనాలంటే ఆ పర్సనలేమిటో చెప్పాలి.

రెండోది, ఎవర్నైనా కాపాడుతున్నారా మీరూ? డ్రైవర్‌... పని మనిషీ... లేకపోతే అన్ని గాయాలు కన్పిస్తూంటే ఆత్మహత్య అని ఎలా అంటారు? ఢిల్లీ నుంచి మీరే ఆర్డర్స్‌ ఇచ్చారా వాళ్లకిలా చేయమనీ?’ ‘ఏం నాన్సెన్స్‌ మాట్లాడుతున్నారు సర్‌ మీరు, ఏం నాన్సెన్స్‌ ఇది?’ఏఎస్పీ మాథుర్‌ టీమ్‌ని రంగంలోకి దించాడు. డ్రైవర్‌ కోసం, పనిమనిషి కోసం గాలించడం మొదలెట్టారు. పోస్టుమార్టం రిపోర్టులో ఒక కీలక అంశం అతణ్ణి తికమక పెడుతోంది. ఇదుంటే అదెలా జరుగుతుంది? ఇది హత్యే - అని పీఎం రిపోర్టు స్పష్టం చేస్తోంది.

చంపిన తర్వాతే వేలాడదీశారు. ఆమె చేతి మీద కోసిన ఆయుధం కన్పించడం లేదు. అలాగే ఆమె సెల్‌ ఫోన్‌ లేదు. ఇంట్లో నగలూ డబ్బూ భద్రంగా వున్నాయి. పనివాళ్ళే చేసుంటే, వీటి కోసం చేయలేదనుకోవాలి. ఇంకా, ఎవరి కోసమో చేసి ఉండాలి. ఆ ఎవరో ఎవరో కాదు... అభిషేకే కావచ్చు! కానీ అభిషేక్‌ మీద కేసుకి పీఎం రిపోర్టులో ఈ కీలక అంశం అడ్డు పడుతోందే? ఇదుంటే అదెలా జరిగిందనుకోవాలి?