‘ఏంటి కేసు?’ అడిగాడు సీబీఐ జడ్జి. చెప్పాడు సీబీఐ ప్రాసిక్యూటర్‌. అటు ఎడం పక్క రోషంగా చూస్తూ నిలబడ్డ నిందితుడి మీద ఓ చూపేశాడు జడ్జి. తిరిగి పత్రాలు పరిశీలించి, జ్యుడీషియల్‌ రిమాండ్‌ రాశాడు.

సీబీఐ అధికారులు నిందితుణ్ణి తీసుకుని కోర్టు బయటికి దారి తీశారు. ‘ఇలా చూస్తామనుకోలేదు మిమ్మల్ని’ అన్నారు. ‘చేసింది మీరు. చూస్తున్నది నేను’ అన్నాడు పళ్ళ బిగువున నిందితుడు - మర్డర్‌ కేసులో మూడేళ్ళు స్వేచ్ఛ అనుభవించి, ఇప్పుడు అరెస్టైన గుర్గావ్‌ సివిల్‌ జడ్జి రవనీత్‌ గార్గ్‌. ప్రస్తుతం తను సస్పెన్షన్‌లో ఉన్నాడు.పట్టపగలు పార్కులో బుల్లెట్లు పేలాయి. గొంతులో దిగిన గుండు కపాలంలోంచి బయటికి దూసుకెళ్ళి పోయింది. ఛాతీ మీద తగిలిన బుల్లెట్‌ వీపులోంచి బయటికొచ్చింది. కడుపులో తగిలిన బుల్లెట్‌ నడుము లోంచి బయటికెళ్ళింది. తలలోకి దిగిన బుల్లెట్‌ ఎడం పక్క నుంచి వెళ్ళిపోయింది. నాల్గు బుల్లెట్లూ అక్కడే దొరికాయి. మూడు రివాల్వర్‌వి, ఒకటి నాటు పిస్తోలుది. ఆ రివాల్వర్‌ జడ్జి రవనీత్‌ది. హతురాలు ఆయన భార్య గీతాంజలి.ఫ ఫ ఫపోలీసులు ఆత్మహత్యగా కేసు నమోదు చేశారు. గీతాంజలి తండ్రి అడ్డుకున్నాడు.

ఇది పచ్చి హత్య అనీ, దీన్ని తన జడ్జి అల్లుడే చేశాడనీ, సంఘటన జరిగిన వెంటనే తనే కంప్లెయింట్‌ ఇచ్చాడు. కానీ పోస్ట్‌మార్టం, ఫోరెన్సిక్‌, బాలస్టిక్‌ రిపోర్టులు ఆత్మహత్యనే సూచిస్తున్నాయి. పలుకుబడితో అల్లుడు తారుమారు చేస్తున్నాడని ఆరోపించాడు తండ్రి. ఆత్మహత్యలో అన్నిసార్లు కాల్చుకోవడం వీలవుతుందా? భర్త రివాల్వర్‌తో పాటు, నాటు పిస్తోలు కూడా తెచ్చుకుని కాల్చుకుందా? నాటు పిస్తోల్లోంచి పేలిన తూటా షెల్‌ ఏది? రిపోర్టులో మొత్తం ఆరు బుల్లెట్లు రివాల్వర్‌ లోంచి పేలాయని ఉంటే, మిగతా రెండు బుల్లెట్లు ఏవి? కాబట్టి ఇది హత్య. ఈ హత్యలో కనీసం ఇద్దరు పాల్గొని ఉండాలి. దీన్ని సీబీఐకి అప్పగిస్తేనే న్యాయం జరుగుతుంది - ఆ తండ్రి డిమాండ్‌ ప్రకారమే, కేసు సీబీఐకి వెళ్ళింది.జడ్జి రవనీత్‌ తన భార్య చనిపోతే, పోలీస్‌ కంప్లెయింటే ఇవ్వలేదని గుర్తించారు. సంఘటన చూసిన సాక్షులు లేరు. తుపాకీ శబ్దాలు ఎవరికీ వినపడలేదు.

అసలు ఘటనా స్థలంలో రక్తమే లేదు. సంఘటన అక్కడ జరిగినట్టులేదు, శవమే అక్కడ చేరి ఉండాలి. అక్కడ పేలిన బుల్లెట్లు దొరకడమంటే... వాటిని కూడా తెచ్చి పడేసి ఉండాలి. సంఘటన ఇక్కడే జరిగివుంటే, ఇక్కడ దొరికిన బుల్లెట్లకి రక్తం ఉండాలి. అదీ లేదు. వీటన్నిటి దృష్ట్యా ఇది హత్యే. ఆ సమయంలో రవనీత్‌ కోర్టులో వీడియో కాన్ఫరెన్స్‌లో ఉన్నట్టు సాక్ష్యముంది. హత్య తనే జరిపించి ఉంటే ఈ సాక్ష్యంతో ఉపయోగం లేదు. హత్య జరిగిందనడానికి తగిన పరిస్థితులన్నీ ఉన్నాయి. ఆత్మహత్య చేసుకోవడానికి కారణాల్లేవు..